Dunki Trailer: డంకీ ట్రైలర్ వచ్చేసింది.. కింగ్ ఖాన్ అదరగొట్టేశాడు
Dunki Trailer: షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవేటెడ్ మూవీ డంకీ ట్రైలర్ వచ్చేసింది. ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లాలని కలలు కనే పాత్రలో కింగ్ ఖాన్ అదరగొట్టేశాడు.
Dunki Trailer: డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా.. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం (డిసెంబర్ 5) రిలీజైన ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది.
డంకీ మూవీలో ఇంగ్లిష్ నేర్చుకొని యూకే వెళ్లి సెటిలవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ అదరగొట్టేశాడు. ఎంత ప్రయత్నించినా ఇంగ్లిష్ రాకపోవడంతో అక్రమంగా విదేశంలోకి చొరబడాలని ప్రయత్నించడం, తర్వాత దొరికిపోవడం, ఆ ప్రయాణంలో అతడు, అతని స్నేహితులు పడే ఇబ్బందులు.. ఇలా డంకీ స్టోరీని సింపుల్ గా మూడు నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ ట్రైలర్ ను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "ఈ కథను నేను లాల్టూ నుంచి మొదలు పెట్టాను. దీనిని నేనే ముగిస్తాను కూడా. నా ఫ్రెండ్స్ తో కలిసి. రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డంకీ ట్రైలర్ చూపిస్తుంది. ఈ ట్రైలర్ స్నేహం, కామెడీ, విషాదాన్ని మేళవించడంతోపాటు ఇల్లు, కుటుంబ జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంటుంది. ఎదురు చూపులు ఫలించాయి. డంకీ డ్రాప్ వచ్చేసింది" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు.
కింగ్ ఖాన్ చెప్పినట్లుగానే డంకీ ట్రైలర్ ఉంది. సరదాగా మొదలయ్యే ఈ ట్రైలర్.. తర్వాత రోలర్ కోస్టర్ లాగా తిరుగుతూ చివరికి షారుక్ ఖాన్ ను తాను అనుకున్నది సాధించి గెలిచి నిలిచిన ఓ ముసలివాడిగా చూపిస్తూ ముగుస్తుంది. డంకీ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, సాంగ్స్ అన్నీ మనసుకు హత్తుకునేలానే ఉన్నాయి. మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకేలాంటి సినిమాలను తీసిన రాజు హిరానీ డైరెక్షన్ లో షారుక్ సినిమా కావడంతో డంకీపై భారీ అంచనాలు ఉన్నాయి.
అసలు డంకీ అంటే ఏంటి?
చాలా మందికి ఈ సినిమా పేరు వింతగా అనిపించింది. అసలు డంకీ అంటే ఏంటని ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. డంకీ అంటే మరో దేశంలోకి అక్రమంగా చొరబడటం అనే అర్థంలో వాడతారు. ఇది పక్కా దేశీ యాస. ఈ టైటిల్ అర్థాన్ని ఇప్పటికే షారుక్ ఖాన్, రాజు హిరానీ వివరించే ప్రయత్నం చేశారు. ఇండియా నుంచి ఎన్నో దేశాలను దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఇంగ్లిష్ రాకపోవడంతో వీళ్ల వీసాలు రిజెక్ట్ కావడం, ఎలాగైనా ఆ దేశానికి వెళ్లాలని భావించి తమ అక్రమ ప్రయాణాన్ని మొదలుపెట్టడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. డంకీ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆ మరుసటి రోజే ప్రభాస్ సలార్ కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పఠాన్, జవాన్ రూపంలో రెండు వెయ్యి కోట్ల కలెక్షన్ల సినిమాలు అందించిన షారుక్ ఖాన్.. మరో మ్యాజిక్ కు సిద్ధమవుతున్నాడు.