Dunki Trailer Record: డంకీ ట్రైలర్ సునామీ.. సలార్ రికార్డు కూడా బ్రేక్
Dunki Trailer Record: షారుక్ ఖాన్ మూవీ డంకీ ట్రైలర్ సునామీ క్రియేట్ చేసింది. ఈ మధ్యే వచ్చిన ప్రభాస్ సలార్ ట్రైలర్ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.
Dunki Trailer Record: డంకీ ట్రైలర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక మంది చూసిన హిందీ సినిమా ట్రైలర్ గా నిలిచింది. అది కూడా కేవలం 24 గంటల్లోనే కావడం విశేషం. ఈ క్రమంలో ప్రభాస్ సలార్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో డంకీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతున్న డంకీ మూవీ సలార్ తో పోటీ పడుతోంది. డంకీ ట్రైలర్ మంగళవారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ ను కేవలం 24 గంటల్లోనే ఏకంగా 5.8 కోట్ల మంది చూడటం విశేషం. ఈ క్రమంలో తొలి 24 గంటల్లో అత్యధిక మంది చూసిన హిందీ సినిమా ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇంతకుముందు ఈ రికార్డు సలార్ ట్రైలర్ పేరిట ఉంది. ఈ ట్రైలర్ ను తొలి 24 గంటల్లో 5.4 కోట్ల మంది చూశారు. డంకీ ట్రైలర్ బుధవారం (డిసెంబర్ 6) సాయంత్రం 7 గంటల సమయానికి 6.4 కోట్ల మంది చూశారు. మరోవైపు సలార్ హిందీ ట్రైలర్ ను 4 రోజుల్లో 6.5 కోట్ల మంది చూశారు. డంకీ ట్రైలర్ కు 13 లక్షల లైక్స్ రాగా.. సలార్ ట్రైలర్ కు 11 లక్షల లైక్స్ వచ్చాయి.
డంకీ ట్రైలర్ కు అన్ని భాషల్లో కలిపి 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే పఠాన్, జవాన్ రూపంలో రెండు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న షారుక్ ఖాన్ కు దేశంలో ఉన్న క్రేజ్ కు ఈ నంబర్స్ అద్దం పడుతున్నాయి. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ రంజుగా సాగనుంది.
డంకీ ట్రైలర్ కు నిజానికి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా మంది ఈ ట్రైలర్ పై పెదవి విరిచారు. బోరింగా ఉందంటూ విమర్శించారు. ట్రైలర్ రిలీజైన కాసేపటికే డిజాస్టర్ అనే పదం టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లింది. లండన్ కు వెళ్లాలని కలలు కనే ఐదుగురు స్నేహితులు ఇంగ్లిష్ రాక తంటాలు పడుతూ అక్రమంగా ఆ దేశంలోకి వెళ్లే కథతో డంకీ రూపొందింది. షారుక్ తోపాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ ఇందులో నటించారు.