మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఎన్నో తెలుగులో యూట్యూబ్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్ (Salute). 2022లో రిలీజైన ఈ మూవీకి అప్పట్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఎస్ఐ అరవింద్ కరుణాకరన్ పాత్రలో దుల్కర్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. మరి ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకోండి.
మలయాళం థ్రిల్లర్ మూవీ సెల్యూట్ మొదట్లోనే ఓ హత్య కేసు, మరో ర్యాష్ డ్రైవింగ్ కేసు వివరాల గురించి తెలుసుకోవడానికి సెలవులో వెళ్లిన ఎస్ఐ అరవింద్ కరుణాకరన్ (దుల్కర్ సల్మాన్) ఓ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. ఆ తర్వాతే అతడు సెలవులో వెళ్లడానికి కారణమైన ఆ హత్య కేసు ఏంటన్నది చూపిస్తారు. తర్వాత కథ గతానికి వెళ్తుంది.
ఓ హత్య కేసులో పోలీసులు సాక్ష్యాధారాలను ఓ అమాయకుడికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉండటం చూపిస్తారు. ఓ పార్టీకి చెందిన నేత, అతని భార్యను క్రూరంగా హత్య చేస్తారు. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్ ను అనుమానితుడిగా భావించినా సాక్ష్యాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉండవు. అసలు నేరస్థుడిని పట్టుకోలేని పోలీసులు ఆధారాలను సృష్టించి మరీ అతనికి శిక్ష పడేలా చేస్తారు.
తర్వాత ఇదే కేసులో అనుమాతుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ కేసులో పోలీసులకు దొరకుతాడు. అతనికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలుతుంది. కానీ అప్పటికే కోర్టులో కేసు నడుస్తుండటం, ఆటో డ్రైవర్ కు వ్యతిరేకంగా ఆధారాలు కూడా సృష్టించడంతో దీనిని ఇంతటితో వదిలేయాలని పోలీసులు భావిస్తారు.
ఈ కేసులో డీఎస్పీ అజిత్ కరుణాకరన్ (మనోజ్ కే జయన్)తోపాటు మరో నలుగురు పోలీసులు ఉంటారు. మిగిలిన వాళ్లు దీనిపై సైలెంట్ గానే ఉన్నా.. ఎస్సై అరవింద్ కరుణాకరన్ ఈ అన్యాయాన్ని సహించలేకపోతాడు. అసలు హంతకుడిని పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెడతాడు.
అసలు నేరస్థుడిని పట్టుకుంటే తన ఉద్యోగంతో తన సొంత అన్నే అయిన డీఎస్పీ అజిత్ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉందని తెలిసినా అతడు ముందుకే వెళ్తాడు. ఆ తర్వాత ఈ కేసును అతడు ఎలా దర్యాప్తు చేస్తాడు? ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అసలు హంతకుడు అరవింద్ చేతికి చిక్కుతాడా అన్నదే సెల్యూట్ మూవీ స్టోరీ.
కేసు ఏదైనా అసలు నేరస్థుడిని పట్టుకోవడంలో విఫలమయ్యే పోలీసులు తప్పుడు సాక్ష్యాధారాలు ఎలా సృష్టిస్తారు? అమాయకులను ఎలా బలి చేస్తారు అన్నది ఈ సెల్యూట్ మూవీలో చూడొచ్చు. ఓ నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్ పశ్చాత్తాపంతో తన కెరీర్, జీవితాన్నే పణంగా పెట్టి అసలు నేరస్థుడి కోసం వెతకడాన్నీ ఇందులో చూడొచ్చు.
రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. అతడు ఈ కేసు విచారణ సాగించే తీరే సినిమాకు బలం. మారుపేర్లతో తరచూ ఊళ్లు మారుస్తూ ఉండే అతన్ని పట్టుకోవడం అరవింద్ కు సవాలుగానే ఉంటుంది. అయితే అతడు దర్యాప్తు చేసే తీరు, చివరికి నిందితుడి దగ్గరి వరకూ వెళ్లడం, అసలు నేరస్థుడు ఎవరు అన్న ఉత్కంఠ చివరి వరకూ కొనసాగుతుంది.
అయితే ఊహకందని క్లైమ్యాక్స్ కూడా ఈ సెల్యూట్ సినిమాను ప్రత్యేకంగా నిలిపిందని చెప్పొచ్చు. సెల్యూట్ మూవీ సోనీ లివ్ ఓటీటీతోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం