Dream Catcher Review: డ్రీమ్ క్యాచర్ రివ్యూ.. సరికొత్త తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Dream Catcher Movie Review In Telugu: తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా డ్రీమ్ క్యాచర్. కలలు కనడం, భవిష్యత్తులో జరిగేది డ్రీమ్స్‌లో కనిపించడం వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్‌తో రూపొందిన డ్రీమ్ క్యాచర్ ఇవాళ (జనవరి 3) విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో డ్రీమ్ క్యాచర్ రివ్యూలో తెలుసుకుందాం.
Dream Catcher Review Telugu: తెలుగులో జనవరి 3న థియేటర్లలో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ డ్రీమ్ క్యాచర్. ప్రశాంత్ కృృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, నాగరాజు ప్రధాన పాత్రలో సందీప్ కాకుల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయోగాత్మక తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో డ్రీమ్ క్యాచర్ రివ్యూలో తెలుసుకుందాం.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
టైటిల్: డ్రీమ్ క్యాచర్
నటీనటులు: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, నాగరాజు తదితరులు
కథ, దర్శకత్వం: సందీప్ కాకుల
నిర్మాణం: సియోల్ మోషన్ పిక్చర్స్
సంగీతం: రోహన్ శెట్టి
సినిమాటోగ్రఫీ: ప్రణీత్ గౌతమ్ నంద
ఎడిటింగ్: ప్రీతమ్ గాయత్రి
విడుదల తేది: 3 జనవరి 2025
కథ:
దేవ్ (ప్రశాంత్ కృష్ణ) సక్సెస్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన కొలిగ్, ఫ్రెండ్ కార్తీక్ (శ్రీనివాస్ రామిరెడ్డి)తో కలిసి నివసిస్తుంటాడు. అయితే, తనకు వచ్చే కలల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంటాడు. ఆఫీస్‌లో ఎంత పోటీ ఉన్నా ప్రమోషన్ సాధిస్తాడు. ఇలా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ కలలు నిజమనే భ్రమలో పడిపోతాడు దేవ్. తన ఫ్రెండ్‌కు ప్రమాదం ఉందని, అది నిజమైపోతుందన్న భయం వెంటాడుతుంది.
ట్విస్టులు
దీంతో దేవ్ ఏది నిజం, ఏది కల అనేది తెలుసుకోలేని పరిస్థితిలోకి వెళ్తాడు. కలలు దేవ్‌ను ఎంతలా ప్రభావితం చేశాయి? వాటి నుంచి ఎలా బయటపడగలిగాడు? అసలు ఆ కలలు తనకే ఎందుకు వస్తున్నాయి? తనను నిజంగా ప్రేమించేది ఎవరు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ డ్రీమ్ క్యాచర్ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
టాలీవుడ్‌లో కూడా ఎన్నో విభిన్న ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ప్లాప్‌గా మిగిలాయి. ఫలితం ఎలా ఉన్న న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ సరికొత్త కథలను, ఎక్సపరిమెంటల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. అలా తెరకెక్కిందే డ్రీమ్ క్యాచర్. ఈ మూవీ హాలీవుడ్ స్టైల్‌కు దగ్గరిగా ఉండే ఒక వినూత్న ప్రయత్నం.
కలలు రావడం, అవి నిజం కావడం, అందులో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోవడం వంటి ప్లాట్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే, సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఫాస్ట్‌గా రన్ అయినా కొన్ని రిపీటెడ్ సీన్స్ మాత్రం బోర్ కొట్టిస్తాయి. దేవ్ ఎదుర్కొంటున్న పరిస్థితిని, వచ్చే కలలను అంచనా వేస్తూ ఒక్కో డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్లే తీరు ఆకట్టుకుంటుంది.
విజువల్స్ అదుర్స్
దేవ్‌లా ఆడియెన్స్ కూడా ఫీల్ అయ్యేలా కథనం సాగుతుంది. నెరేషన్ గ్రిప్పింగ్‌గా ఎంగేజింగ్‌గా ఉంటుంది. బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. సీన్‌కు తగిన మూడ్ క్రియేట్ చేస్తుంది. విజువల్స్ అదిరిపోయాయి. హాలీవుడ్ స్టైల్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో సినిమాటోగ్రాఫర్ ప్రణీత్ గౌతమ్‌ను మెచ్చుకోవాల్సిందే. హై క్లారిటీ విజువల్స్‌తో అద్భుతంగా చూపించారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి.
ఇక ప్రీతమ్ గాయిత్రి షార్ప్ ఎడిటింగ్ మరో హైలెట్ అని చెప్పొచ్చు. అతి తక్కువ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌కు ఎంగేజ్ చేసేలా సీన్ కట్స్ ఉన్నాయి. ఇక డైరెక్టర్ సందీప్ కాకుల ఎంచుకున్న కథ, టేకింగ్ బాగుంది. అయితే, కొన్ని చోట్ల ఇంకాస్తా శ్రద్ధ పెట్టాల్సింది. ఇక నటీనటులు అంతా తమ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు.
ఫైనల్‌గా చెప్పాలంటే
ప్రశాంత్ కృష్ణ తన పాత్రలో ఆడియెన్స్ ఫీల్ అయ్యేంతలా జీవించేశాడు. కన్‌ఫ్యూజన్, ఎమోషన్స్ వంటి అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్ బాగా పండించాడు. అనీషా ధామ స్క్రీన్ ప్రజన్స్ బాగుంది. శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, నాగరాజు తమ పాత్రలతో మెప్పించారు. ఫైనల్‌గా చెప్పాలంటే గంటన్నర మాత్రమే రన్ టైమ్ ఉన్న ఎక్సపరిమెంటల్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ డ్రీమ్ క్యాచర్ ఆకట్టుకుంటుంది.