R.Narayana Murthy: ఆందోళన చెందొద్దు.. అప్పుడు అన్ని వివరాలు చెబుతా: ఆర్ నారాయణ మూర్తి
R.Narayana Murthy: నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆసుపత్రిలో చేరడంతో ఆందోళన నెలకొంది. ఈ విషయంలో రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయనే స్పందించారు. తాను కోలుకుంటున్నానని వెల్లడించారు.

విప్లవ చిత్రాల దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చేరడంతో ఒక్కసారిగా ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి ఏమైదంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నారాయణ మూర్తి స్పందించారు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందవద్దంటూ వెల్లడించారు.
అన్ని వివరాలు చెబుతా..
తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాను పూర్తిగా కోలుకున్నాక ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.
తాను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, దేవుడి దయవల్ల బాగా కోలుకుంటున్నానని ఆర్.నారాయణ మూర్తి వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. నారాయణ మూర్తి ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏం జరిగింది?
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి నేడు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్టుగా సమాచారం బయటికి వచ్చింది.
దీంతో నారాయణ మూర్తి ఆసుపత్రిలో ఎందుకు చేరారంటూ ఆందోళన మొదలైంది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రూమర్లు వ్యాప్తి చెందాయి. ఇవి కాస్త ఎక్కువవయ్యాయి. దీంతో నారాయణ మూర్తి స్పందించి.. ఆందోళన చెందవద్దని వివరించారు. దీంతో రూమర్లకు చెక్ పడింది.
నారాయణ మూర్తి గతంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారని సమాచారం. సాధారణ టెస్టుల్లో భాగంగానే ఆయన ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది.
విప్లవ చిత్రాలతో పీపుల్స్ స్టార్‌గా..
ఆర్.నారాయణ మూర్తి విప్లవ చిత్రాలను తెరకెక్కించి ప్రజల గళంగా నిలిచారు. దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రల్లో నటించారు. పీపుల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. దండోర, ఎర్రసముద్రం, ఒరేయ్ రిక్షా, దండకారాణ్యం సహా చాలా చిత్రాలను ఆయన చేశారు. సుమారు 40కు పైగా చిత్రాలను ఆర్.నారాయణ మూర్తి చేశారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆయన.. కొంతకాలంగా అంత యాక్టివ్‍గా లేరు. చివరగా 2021లో రైతన్న చిత్రం చేశారు నారాయణ మూర్తి. ఎన్ని సినిమాలు చేసినా ఆయన సింప్లిసిటీతోనే ముందుకు సాగారు. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా నారాయణ మూర్తి సున్నితంగానే తిరస్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతాలనే కొనసాగిస్తున్నారు.
టాలీవుడ్ సమస్యలపై కూడా పలుసార్లు నారాయణ మూర్తి గళమెత్తారు. సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలకు కూడా వివరించారు.