RGV Tweet on Pushpa 2: పుష్ప 2పై మరో ట్వీట్ వదిలిన రాంగోపాల్ వర్మ.. పాన్ ఇండియా కాదట.. కొత్త పదం తెరపైకి
RGV Tweet on Pushpa 2: పుష్ఫ 2 మూవీపై మరోసారి రాంగోపాల్ వర్మ ట్వీట్ వదిలారు. సినిమాకి రిలీజ్‌కి ముందు నుంచే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్న ఆర్జీవీ.. ఈరోజు సంచలన ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీకి గత కొన్నిరోజులుగా వరుస ట్వీట్‌లతో సపోర్ట్ చేస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆదివారం కూడా ఒక ట్వీట్ వదిలారు. డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన పుష్ప 2 మూవీ.. రికార్డ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది.
4 రోజుల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
ఇప్పటికే అత్యధిక వేగంగా రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించిన పుష్ప 2 సినిమా.. 4 రోజుల్లోనే రూ.700 కోట్లకి చేరుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప2 హిట్‌గా నిలవగా.. తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా కలెక్షన్స్ వస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇడ్లీ కథతో ఆర్జీవీ సపోర్ట్
పుష్ప 2 మూవీ రిలీజ్‌కి ముందు టికెట్స్ ధర చాలా సిటీల్లో రూ.1,500-2,000 పలకడంతో.. తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దశలో సుబ్బారావు ఇడ్లీ కథ చెప్పిన రాంగోపాల్ వర్మ.. విమర్శకులకి గట్టిగా చురకలు అంటించేశాడు. ఆ తర్వాత కూడా సినిమా గురించి వరుసగా ట్వీట్స్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఒక ట్వీట్ చేసిన వర్మ.. పాన్ ఇండియాను పుష్ప 2 మూవీ తెలుగు ఇండియాగా మార్చేసిందని కితాబిచ్చారు.
హిందీ మాట్లాడలేకపోయినా..
‘‘బాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద హిందీ మూవీగా తెలుగు డబ్బింగ్ మూవీ పుష్ప 2 నిలిచింది. హిందీలో కనీసం మాట్లాడలేకపోయినా.. బాలీవుడ్ హిస్టరీలోనే అతి పెద్ద హిందీ నటుడిగా తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ నిలిచాడు. కాబట్టి ఇది పాన్ ఇండియా కాదు.. ఇది తెలుగు ఇండియా’’ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
ఆరు భాషల్లోనూ హిట్
పుష్ప 2 మూవీ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు బెంగాలీలోనూ రిలీజైంది. ఓవర్సీస్‌లోనూ రికార్డుల మోత మోగించేస్తున్న పుష్ప2 మూవీ.. విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌గా నిలిచింది. 2021లో వచ్చిన పుష్ప: ది రైజ్ మూవీకి ఇది సీక్వెల్‌కాగా.. 12,500 స్క్రీన్లలో పుష్ప2 మూవీ రిలీజైన విషయం తెలిసిందే.