Sai Pallavi: సాయి పల్లవి ఒప్పుకుంటే దేవి అనుగ్రహం అవుతుంది.. అదో వింత అలవాటు.. డైరెక్టర్ కామెంట్స్
Rajkumar Periasamy About Sai Pallavi Anugraham: సాయి పల్లవి సినిమా ఒప్పుకుంటే దేవత అనుగ్రహం పొందినట్లే అని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమరన్ మూవీ రిలీజ్ కంటే ముందు హైదారబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి పల్లవిపై డైరెక్టర్ ఇలా కామెంట్స్ చేశారు.
Sai Pallavi Anugraham: లేడి పవర్ స్టార్‌గా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. గ్లామర్ ఒలకబోయకుండా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు అని నిరూపించింది సాయి పల్లవి. తెలుగులో తండేల్ మూవీతో అలరించడానికి సిద్ధంగా ఉన్న సాయి పల్లవి ఇటీవల యాక్ట్ చేసిన బయోగ్రాఫికల్ మూవీ అమరన్.
కమల్ హాసన్ నిర్మాతగా
ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ అమరన్‌లో ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి యాక్ట్ చేసింది. ఈ సినిమా టైటిల్ రోల్‌లో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించాడు. లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన అమరన్ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 31న దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన అమరన్ మూవీకి విశేష స్పందన వస్తోంది. మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది అమరన్ మూవీ. అలాగే, సినిమాలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని నెటిజన్స్ పొగుడుతున్నారు. ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అని అమరన్ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు.
అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇదిలా ఉంటే, అమరన్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేసింది టీమ్. తమిళనాడు, కేరళ ఇలా సౌత్ మొత్తం అమరన్ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి పల్లవిపై డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
స్పీచ్ స్టార్ట్ చేసిన రాజ్ కుమార్ పెరియసామి ముందుగా సాయి పల్లవి పేరు ఎత్తాడు. దాంతో హాల్ అంతా అరుపులు, ఈలలతో మారుమోగిపోయింది. స్టార్ హీరో రేంజ్‌లో సాయి పల్లవికి ఎలివేషన్ ఇచ్చారు అభిమానులు. దాంతో సాయి పల్లవి చాలా బ్లెస్‌డ్‌గా ఫీల్ అయింది. "పర్లేదు మాట్లాడండి" అన్నట్లుగా సైగ చేసింది సాయి పల్లవి.
దేవి అనుగ్రహంలా
దాంతో "మీ ప్రేమకు థ్యాంక్స్. సాయి పల్లవి గారు స్టేజీ మీదకు వస్తారు. అప్పుడు మీ అభిమానం చూపించండి" అనే అర్థంలో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి అన్నారు. "నేను ఇదివరకు తమిళంలో ఒక షోకి వెళ్లినప్పుడు చెప్పాను. ఎవరైనా కుదిరితే బెటర్‌గా ట్రాన్స్‌లేట్ చేయండి. ఒక్కసారి సాయి పల్లవి ఒక పాత్రను ఎంచుకుంటే, ఒక్కసారి ఒక సినిమాలో భాగస్వామ్యం అయితే దానికి తమిళంలో ఒక పదం ఉంది" అని రాజ్ కుమార్ తెలిపారు.
"తెలుగులో కూడా ఆ పదం ఉంది అనుకుంటా. నాకు సరిగ్గా తెలీదు. అది ఒక సంస్కృత పదం. ఒక్కసారి ఒక ప్రాజెక్ట్‌ను సాయి పల్లవి ఓకే చేస్తే అది ఆ ప్రాజెక్ట్‌కు అనుగ్రహం. ఆ ప్రాజెక్ట్‌కు పూర్తిగా ఒక పవిత్రత వస్తుందని నేను నమ్ముతాను. తను మనస్ఫూర్తిగా ఆ సినిమాకు ఎంతో ప్రాముఖ్యతను తీసుకొస్తుంది. అదే తన కళ. అదే తను చేస్తుంది" అని అదొక దేవత అనుగ్రహం లాంటిది అన్న అర్థంలో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి అన్నారు.
డ్యాన్సర్‌గా ఉన్నప్పుడే
"నాకు సాయి పల్లవి డ్యాన్సర్‌గా ఉన్నప్పుడే, టీవీ షోల్లో చేస్తున్నప్పటి నుంచే తెలుసు. తను చాలా జెన్యూన్. నాకు మనుషుల ఫోన్ నెంబర్స్‌ను నిక్ నేమ్‌తో సేవ్ చేసుకునే ఒక వింత అలవాటు ఉంది. ఎవరైనా నాకు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వారి పేర్లను సేవ్ చేసుకోను. అలా నాకు సాయి పల్లవి పరిచయం అయినప్పుడు నేను హీరోయిన్ అని సేవ్ చేసుకున్నాను. కారణం నాకు తెలీదు. కానీ, ఇప్పటికీ నా ఫోన్‌లో హీరోయిన్ అనే ఉంటుంది" అని రాజ్‌కుమార్ పెరియసామి చెప్పారు.