Harish Shankar: సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడుపై దర్శకుడు హరీశ్ శంకర్ ఫైర్.. ఇక వదిలేస్తే మేలు అంటూ హెచ్చరిక-director harish shankar fires on cinematographer chota k naidu regarding ramayya vasthavayya movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harish Shankar: సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడుపై దర్శకుడు హరీశ్ శంకర్ ఫైర్.. ఇక వదిలేస్తే మేలు అంటూ హెచ్చరిక

Harish Shankar: సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడుపై దర్శకుడు హరీశ్ శంకర్ ఫైర్.. ఇక వదిలేస్తే మేలు అంటూ హెచ్చరిక

Harish Shankar on Chota K Naidu: సినిమాటోగ్రఫార్ చోటా కే నాయుడుపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తనపై ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. ఇప్పటికైనా ఆ విషయాన్ని వదిలేయాలని ఘాటుగా నోట్ రిలీజ్ చేశారు.

Harish Shankar: స్టార్ సినిమాటోగ్రాఫర్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ ఫైర్.. ఇక వదిలేస్తే మేలు అంటూ హెచ్చరిక

Director Harish Shankar: ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం విషయంలో డైరెక్టర్ హరీశ్ శంకర్‌పై సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఇటీవలే కొన్ని కామెంట్లు చేశారు. 11 ఏళ్ల క్రితం ఆ మూవీ షూటింగ్‍లో జరిగిన విషయాలను చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన పనికి హరీశ్ శంకర్ తరచూ అడ్డుపడే వారని చోటా చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎట్టకేలకు హరీశ్ శంకర్ నేడు (ఏప్రిల్ 20) స్పందించారు. చోటా కే నాయుడుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ నోట్ ట్వీట్ చేశారు.

‘అందుకే తీసేయలేదు’

రామయ్య వస్తావయ్య సినిమాలో మధ్యలోనే తాను చోటా కే నాయుడును తీసేయాలని అనుకున్నానని, కానీ నిర్మాత దిల్‍రాజు చెప్పడం సహా అందరూ ఏమనుకుంటారోనని అలా చేయలేదని డైరెక్టర్ హరీశ్ శంకర్ తన నోట్‍లో వెల్లడించారు. “ఓ సందర్భంలో మిమ్మల్ని (చోటా కే నాయుడు) తీసేసి వేరే కెమెరామెన్‍తో షూటింగ్ చేద్దామనే ప్రస్తావన వచ్చింది. అయితే, గబ్బర్ సింగ్ అవకాశం వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‍ను తీసేస్తున్నాడని పది మంది పది రకాలుగా అనుకుంటారనో.. రాజుగారు (దిల్‍రాజ్) చెప్పడం వల్లనో మీతోనే సినిమా పూర్తి చేశా” అని హరీశ్ శంకర్ పేర్కొన్నారు.

నేనెప్పుడూ మాట్లాడలేదు

పదేళ్లలో చోటా కే నాయుడు ఉదాహరణకు ఓ 10 ఇంటర్వ్యూలు ఇస్తే.. తను 100 ఇచ్చి ఉంటానని హరీశ్ శంకర్ తెలిపారు. కానీ ఆయనపై తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని హరీశ్ చెప్పారు. “నేను ఎప్పుడూ.. ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. ఇప్పుడు ఇంటర్య్వూ చేసిన వ్యక్తి అడగకపోయినా.. నా ప్రస్తావన రాకున్నా.. నాకు సంబంధం లేకున్నా.. నా గురించి అవమానకరంగా మాట్లాడారు” అని హరీశ్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అందుకే స్పందించా.. ఇక వదలకపోతే..

చోటా కే నాయుడు తన గురించి చాలాసార్లు మాట్లాడినా.. తాను మౌనంగానే ఉన్నానని హరీశ్ శంకర్ తన నోట్‍లో తెలిపారు. అయితే తన స్నేహితులు, తనను అభిమానించే వారు ప్రశ్నిస్తుండటంతో ఇప్పుడు ఇది రాయాల్సి వస్తుందని పేర్కొన్నారు. చోటాతో పని చేయడం తనను బాధపెట్టినా.. ఆయన అనుభవం నుంచి కాస్త నేర్చుకున్నానని, దయచేసి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

ఈ విషయాన్ని చోటా కే నాయుడు ఇక్కడితో వదిలేయాలని, అలా కాదని మళ్లీ మాట్లాడతానంటే ఏ రోజైనా.. ఎక్కడైనా.. తాను వేచి చూస్తుంటానని హరీశ్ శంకర్ ఘాటుగా హెచ్చరించారు. రామయ్య వస్తావయ్యా చిత్రం గురించి మళ్లీ మాట్లాడొద్దని చోటాకు వార్నింగ్ ఇచ్చారు. మరి, ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందేమో చూడాలి.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన రామయ్యా వస్తావయ్యా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. దిల్‍రాజు నిర్మించిన ఈ చిత్రం 2013లో రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

ఇక, హరీశ్ శంకర్ ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేయనున్నారు.