Director Buchi Babu: ‘నాన్నా.. రామ్‍చరణ్ సినిమాకు అలా చేయాల్సిన అవసరం లేదు’-director buchi babu comments on his movie with ram charan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Director Buchi Babu: ‘నాన్నా.. రామ్‍చరణ్ సినిమాకు అలా చేయాల్సిన అవసరం లేదు’

Director Buchi Babu: ‘నాన్నా.. రామ్‍చరణ్ సినిమాకు అలా చేయాల్సిన అవసరం లేదు’

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 19, 2025 08:33 AM IST

Director Buchi Babu: రామ్‍చరణ్‍తో తాను చేయబోయే సినిమా గురించి రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ బుచ్చిబాబు. తన తండ్రి గురించి మాట్లాడుతూ ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు.

బాపు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మాట్లాడిన బుచ్చిబాబు
బాపు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మాట్లాడిన బుచ్చిబాబు

డైరెక్టర్ బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన ఉప్పెన (2021) భారీ హిట్ కొట్టింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍తో తదుపరి భారీ చిత్రం (ఆర్‌సీ16) తెరకెక్కించనున్నారు బుచ్చిబాబు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా మూవీగా ఆర్‌సీ16 ఉండనుంది. ఈ ప్రాజెక్టుపై చాలా అంచనాలు ఉన్నాయి. దీంతో బుచ్చిబాబు ఆ ఈవెంట్‍కు వెళ్లినా రామ్‍చరణ్‍తో చిత్రం గురించే ప్రశ్నలు ఎదురవతున్నాయి. తాజాగా బాపు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు బుచ్చిబాబు వెళ్లారు. రామ్‍చరణ్‍తో తన చిత్రం గురించి చెప్పారు. ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు.

ఉప్పెన సినిమాకు మా నాన్న అలా..

ఉప్పెన సినిమా రిలీజైన సమయంలో.. చిత్రం ఎలా ఉందని థియేటర్ వద్ద ప్రేక్షకులను తన తండ్రి అడిగారని బుచ్చిబాబు తెలిపారు. రామ్‍చరణ్‍‍తో తాను చేసే చిత్రానికి తన తండ్రి అలా చేయాల్సి అవసరం ఉండదని అన్నారు. సినిమా అదిరిపోతుందని అన్నారు. బుచ్చిబాబు తండ్రి గతేడాదే మరణించారు. అయితే తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడంలో భాగంగా ఎమోషనల్‍గా బుచ్చిబాబు ఈ మాట అన్నారు.

తన తండ్రితో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని చెప్పాలని బుచ్చిబాబును యాంకర్ అడిగారు. దీంతో ఆయన రియాక్ట్ అయ్యారు. “ఉప్పెన సినిమా టైమ్‍లో నా నాన్న, అమ్మ, చెల్లి థియేటర్‌కు వెళ్లారు. నాన్న సినిమా చూశాడా అని అమ్మను అడిగా. చూడలేదు అని అమ్మ చెప్పారు. థియేటర్ వరకు వచ్చినా లోపలికి రాలేదని అన్నారు. గేటు బయట నిలబడి సినిమా బాగుందా లేదా అని అందరినీ అడిగారని చెప్పారు” అని బుచ్చి బాబు గుర్తు చేసుకున్నారు. “నాన్నా.. రామ్‍చరణ్‍తో నేను చేసే సినిమా గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు” అని బుచ్చిబాబు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అదిరిపోతుందని నమ్మకంగా ఈ మాట చెప్పారు. సినిమాలకు వెళితే ఒకప్పుడు తన తండ్రి బాగా కొట్టేవారని కూడా చెప్పారు.

వ్యవసాయం చేస్తే డబ్బు ఎవరికో..

తన తండ్రి వ్యవసాయం చేస్తుంటారని బుచ్చిబాబు తెలిపారు. అయితే, వ్యవసాయం చేసిన డబ్బు ఎవరికో పోతాయో కూడా తెలియదని అనేవారని చెప్పుకొచ్చారు. “వర్షం ఎక్కువగా వస్తే పంటలు పోతాయి.. నష్టం వస్తుంది కదా. అప్పుడు మా నాన్న ఓ మాట అనేవారు. పేకాట ఆడితే డబ్బులు ఎదుటోడికో.. పొక్కోడికో వెళతాయిరా.. వ్యవసాయం చేస్తే ఎవరికి వస్తాయో కూడా తెలియదని, పోతాయని అనేవారు. పెట్టుబడి పెట్టి కష్టపడిన తర్వాత ఒక్క రాత్రిలో అంతా పోయేది. ఎకరం పొలం చేసేందుకు సంవత్సరం చేస్తే ఐదువేలే వస్తుంది. మా నాన్న కాలం చేసి సంవత్సరం అయింది” అని బుచ్చిబాబు అన్నారు.

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఆర్సీ16లో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివ రాజ్‍కుమార్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నాయి.

బ్రహ్మాజీ, ఆమని, ధన్యబాలకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించిన బాపు చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం