Daaku Maharaaj: డాకు మహారాజ్‌లో 5 యాక్షన్ సీన్స్ హై ఇస్తాయి.. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి.. డైరెక్టర్, నిర్మాత కామెంట్స్
Director Bobby Kolli Naga Vamsi About Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ మూవీపై డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డాకు మహారాజ్‌లో 5 యాక్షన్ సీన్స్ ఉంటాయని, ఒక్కో సీక్వెన్స్ ఎంతో హై ఇస్తుందని దర్శకుడు చెప్పారు.
Director Bobby Kolli Naga Vamsi About Daaku Maharaaj: వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ఈ సంక్రాంతికి కూడా మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.
డాకు మహారాజ్ రిలీజ్ డేట్
డాకు మహారాజ్ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
డాకు మహారాజ్ ట్రైలర్
ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. 'డాకు మహారాజ్' సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ జనవరి 12న విడుదలవుతోంది" అని అన్నారు.
బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా
"డాకు మహారాజ్‌తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. 'డాకు మహారాజ్' చిత్రం అస్సలు నిరాశ పరచదు. బాలకృష్ణ గారి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది" అని నిర్మాత నాగవంశీ ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్తగా చూపించాలనే
డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ "మొదటి నుంచి బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి విషయంలో వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాం. ప్రచార చిత్రాలకు బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో సినిమా విజయం పట్ల మాకు మరింత నమ్మకం పెరిగింది" అని అన్నారు.
హత్తుకునే ఎమోషన్స్
"అలాగే 'డాకు మహారాజ్' చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. బాలకృష్ణ గారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నాగవంశీ గారి డ్రీమ్. అందుకు తగ్గట్టుగానే సరికొత్తగా ఉండేలా, ఒక మంచి సినిమాని తీశాము. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది. యాక్షన్‌తో పాటు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది" అని దర్శకుడు బాబీ కొల్లి వెల్లడించారు.