Manoj Bharathiraja dies: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు భారతీరాజా తనయుడు అయిన మనోజ్ భారతీరాజా కన్నుమూశాడు. గతేడాది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించిన అతడు.. గుండెపోటుతో మంగళవారం (మార్చి 25) సాయంత్రం మరణించాడు. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్లు తెలిపింది.
తమిళంతోపాటు తెలుగులోనూ అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు భారతీరాజా తనయుడే ఈ మనోజ్ భారతీరాజా. 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా పరిచమయ్యాడు. ఆ తర్వాత సముదిరమ్, అల్లి అర్జున లాంటి సినిమాల్లో నటించాడు. ఈ మధ్యే అతనికి బైపాస్ సర్జరీ జరిగింది. మంగళవారం సాయంత్రం మరోసారి గుండెపోటు రావడంతో మనోజ్ తుదిశ్వాస విడిచాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చెన్నైలోని చేట్‌పేట్ లో మనోజ్ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఈ మధ్యే బైపాస్ సర్జరీ జరగడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన తనయుడి మరణ వార్త తెలియగానే 83 ఏళ్ల భారతీరాజా హుటాహుటిన అతని ఇంటి వెళ్లాడు. గతేడాది వచ్చిన తమిళ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అతని కెరీర్లో చివరి షో.
మనోజ్ భారతీరాజా మరణవార్త తెలియగానే పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఓ ట్వీట్ చేసింది. “మనోజ్ మన మధ్య లేడన్న వార్త నన్ను షాక్‌కు గురి చేసింది. అతని అకాలమరణం కలచివేస్తోంది. అతడు కేవలం 48 ఏళ్ల వయసు వాడే. ఈ కష్ట సమయంలో అతని తండ్రి భారతీరాజాకు తగిన శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నిన్ను మిస్ అవుతాం మనోజ్. రెస్ట్ ఇన్ పీస్” అని ఖుష్బూ ట్వీట్ చేసింది.
అటు డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా మనోజ్ మరణ వార్త చాలా షాక్ కు గురి చేసినట్లు చెప్పాడు. 1999లో భారతీరాజానే డైరెక్ట్ చేసిన తాజ్ మహల్ సినిమాతో మనోజ్ భారతీరాజా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అల్లి అర్జున, సముదిరం, వర్షమేళ్లం వసంతంలాంటి సినిమాల్లో నటించాడు. రజనీకాంత్ నటించిన రోబో మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. 2022లో వచ్చిన విరుమన్ అతడు నటించిన చివరి సినిమా.
సంబంధిత కథనం