Sankranthiki Vasthunam sequel: సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్.. ఎలా ఉంటుందో చెప్పిన డైరెక్టర్
Sankranthiki Vasthunam sequel: సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ గురించి మాట్లాడారు. టైటిల్‍పై కూడా దాదాపు క్లారిటీ ఇచ్చేశారు.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ - యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది సక్సెస్‍ఫుల్ కాంబినేషన్. తొలుత ఎఫ్2 (2019) చిత్రంతో ఈ కాంబో బ్లాక్‍బస్టర్ కొట్టింది. వెంకటేశ్‍కు ఇది తొలి రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి చేసిన ఎఫ్ 3 కూడా 2022లో వచ్చి సూపర్ హిట్ అయింది. వెంకటేశ్, అనిల్ కాంబోలో మూడో చిత్రంగా గత వారం జనవరి 14న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళుతోంది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే వెంకటేశ్ కెరీర్లో హెయ్యెస్ట్ రికార్డు సృష్టించింది. కాగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని డైరెక్టర్ అనిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదే టెంప్లేట్‍తో సీక్వెల్
సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలనటుడు రేవంత్‍తో యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను వారు పంచుకున్నారు మూవీ టీమ్ సభ్యులు. ఈ సందర్భంగా ఈ మూవీ సీక్వెల్ ప్లాన్‍ను అనిల్ వెల్లడించారు. ఇదే టెంప్లేట్ (కాన్సెప్ట్)తో వేరే పరిస్థితులతో సీక్వెల్ ఉంటుందనేలా చెప్పారు.
సీక్వెల్ మూవీకి ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఉంటుందనేలా కూడా హింట్స్ ఇచ్చారు. అనిల్ చేతుల్లోనే ఉందని ఐశ్వర్య రాజేశ్ ఏదో అంటే.. అనిల్ రావిపూడి కల్పించుకున్నారు. సీక్వెల్‍ల తెలుస్తుందని చెప్పారు. సీక్వెల్ ఎప్పుడు అని సుమ అడిగితే.. మళ్లీ సంక్రాంతికి వస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసినట్టు అనిల్ మాట్లాడారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్ చేసే వీలు ఎక్కువగా ఉందని అనిల్ రావిపూడి చెప్పారు. “ఈ సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందుకంటే ఇది చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లేట్. దీన్నే వేరే పరిస్థితులతో చేయవచ్చు. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి స్టోరీ అక్కడి నుంచే మొదలుకావొచ్చు. మరో అద్భుతాన్ని క్రియేట్ చేయవచ్చు” అని అనిల్ రావిపూడి చెప్పారు.
కొన్నేళ్లుగా థియేటర్లకు రాని వారు కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి వస్తున్నారని ఈ ఇంటర్వ్యూలో వెంకటేశ్ చెప్పారు. ఇలాంటి సినిమా చూడాలని వారందరూ వేచిచూశారని అన్నారు. ఇప్పుడు వాళ్లందరూ థియేటర్లకు వస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులకు మనస్పూర్తి థ్యాంక్స్ చెబుతున్నానని వెంకీ అన్నారు.
తిరుమలను దర్శించిన మూవీ టీమ్
సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీమ్ సక్సెస్ టూర్‌లో భాగంగా తిరుపతికి వెళ్లింది. ఈ క్రమంలో నేడు (జనవరి 19) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు దిల్‍రాజు, శిరీష్, హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి, నటుడు శ్రీనివాస్ రెడ్డి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. ఎఫ్2ను దాటి వెంకటేశ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇంకా జోరు చూపే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే రూ.200కోట్లను దాటడం పక్కాగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం