Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి 100శాతం స్ట్రైక్‍రేట్ కంటిన్యూ.. వరుసగా ఎనిమిదోది.. ఇదే సక్సెస్ మంత్ర
Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి తన 100 శాతం హిట్ రేట్‍ను కొనసాగించేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బ్లాక్‍బస్టర్ పక్కా అని తేలిపోయింది. దీంతో వరుసగా ఎనిమిదో హిట్ కొట్టేశారు అనిల్. ఆ వివరాలు ఇవే..
సినీ ఇండస్ట్రీలో హిట్లు, ప్లాఫ్‍లు సహజం. ముఖ్యంగా డైరెక్టర్ల కెరీర్ ఒడిదొడుకుల మధ్య సాగుతుంటుంది. అయితే, అతితక్కువ మంది మాత్రం వీటికి అతీతంగా ఉంటారు. దర్శక ధీరుడు రాజమౌళికి ఇప్పటి వరకు ప్లాఫ్ ఎదురుకాలేదు. ఆయన తెరకెక్కించిన అన్నీ చిత్రాలు భారీ బ్లాక్‍బస్టర్లే. అయితే, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇదే కోవలో ఉన్నారు. పరాజయం ఎరుగని అతి కొద్ది డైరెక్టర్లలో అనిల్ కూడా నిలిచారు. 100 శాతం హిట్ స్ట్రైక్‍రేట్‍తో కొనసాగుతున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇది కంటిన్యూ అయింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

పటాస్‍తో మొదలుపెట్టి..
2015లో పటాస్ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. కామెడీ ప్రధానంగా ఈ మూవీకి కథను రాసుకున్నారు. దాన్ని ఎఫెక్టివ్‍గా తెరపై చూపించారు. ఈ చిత్రంలో కామెడీ విపరీతంగా పండింది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సూపర్ హిట్ అయింది. తొలి చిత్రంతోనే బంపర్ బ్లాక్‍బస్టర్ సాధించారు అనిల్ రావిపూడి.
సాయిధరమ్ తేజ్‍తో అనిల్ రావిపూడి చేసిన సుప్రీమ్ (2016) కూడా సూపర్ హిట్ సాధించింది. మరోసారి తన కామెడీతో అనిల్ మ్యాజిక్ చేశారు. యాక్షన్ సీన్లను కూడా మెప్పించేలా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ తెరకెక్కించిన రాజా ది గ్రేట్ (2017) కూడా ప్రేక్షకులను మెప్పించింది. సూపర్ హిట్ అయింది. కళ్లు కనిపించని హీరో చుట్టూ అనిల్ చూపించిన కామెడీ, యాక్షన్ ఆకట్టుకుంది. దీంతో హ్యాట్రిక్ హిట్స్ సాధించారు అనిల్.
ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూతో మరో రేంజ్‍కు..
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి వచ్చి భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలో అనిల్ సృష్టించిన కామెడీ విపరీతంగా నచ్చేసింది. వెంకీ పాత్ర ఐకానిక్‍గా నిలిచింది. ఈ చిత్రంతో తొలిసారి రూ.100కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టారు అనిల్. మరింత పాపులర్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చారు అనిల్ రావిపూడి. ఈ మూవీలో మహేశ్‍తో కామెడీని ఎరగదీశారు. తన మార్క్ సరదా సన్నివేశాలు, డైలాలు, అక్కడక్కడా ఎమోషన్, యాక్షన్‍తో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. రూ.250కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది.
ఎఫ్2 ఫ్రాంచైజీలో మరో చిత్రం కూడా తెరెక్కించారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్‍లో ఎఫ్3 (2022)ని తెరకెక్కించారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బాస్టర్ స్టేటస్ తెచ్చుకుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణతో 2023లో భగవంత్ కేసరి తెరకెక్కించారు అనిల్. తన స్టైల్‍కు భిన్నంగా కామెడీ కాకుండా యాక్షన్, ఎమోషన్లు ఎక్కువగా ఉంచుతూ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా రూ.100కోట్ల మార్క్ దాటి హిట్ అయింది.
సంక్రాంతికి వస్తున్నాం హిట్ పక్కా
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఈ మంగవారం (జనవరి 14) థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి రోజున వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా కామెడీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. తొలి రోజు దాదాపు 90శాతానికి పైగా థియేటర్లలో ఆక్యుపెన్సీ నమోదైంది. భారీగా కలెక్షన్లు వచ్చేశాయి. రెండో రోజు కూడా బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. దీంతో ఈ సినిమా ఫుల్ రన్‍లో రూ.100కోట్లు దాటేయడం ఖాయం. దీంతో వరుసగా ఎనిమిదో సూపర్ హిట్‍తో 100 శాతం స్ట్రైక్ రేట్ కొనసాగించినట్టే. తదుపరి మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేయనున్నారు అనిల్.
ఇదే సక్సెస్ మంత్ర
అనిల్ రావిపూడి ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులనే టార్గెట్ చేశారు. కామెడీ ప్రధానంగా కథలు రాసుకొని.. నవ్వించేలా.. మెప్పించేలా తెరకెక్కించారు. ఇదే ఆయన సక్సెస్‌కు ప్రధానమైన కారణంగా ఉంది. కొత్తదనం లేకుండా.. ఒకే రకం సినిమాలు తీస్తున్నారని కొందరి నుంచి విమర్శలు ఎదురైనా.. తనకు సక్సెస్ తెచ్చిన, నచ్చిన పంథాను కొనసాగించారు. భారీ బడ్జెట్ చిత్రాలు.. సంక్లిష్టమైన కథలు కాకుండా ప్రేక్షకులకు కనెక్ట్ చేసే సినిమాలు చేశారు. ముఖ్యంగా సంక్రాంతి ఆయనకు మరింత కలిసి వచ్చింది. అనిల్ రావిపూడి సినిమా అంటే టాక్‍తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేలా ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు. కుటుంబంతో కలిసి చూసే సినిమానే తీస్తారన్నట్టుగా పేరు తెచ్చుకున్నారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ముందే భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ప్రమోషన్లను కూడా డిఫరెంట్‍గా, జోరుగా చేయడం అనిల్ స్టైల్. ఇది కూడా సినిమాలకు బాగా కలిసి వచ్చింది. మరి ఈ 100 స్ట్రైక్‍రేట్‍ను అనిల్ ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి.
సంబంధిత కథనం