క్రిస్మస్ కావడంతో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకొంటున్నారు. తమ ప్రియమైన వారికి బహుమతులు అందజేస్తారు. అయితే దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా.. తన స్నేహితురాలు సమంతకు ఒక అందమైన మెమెంటోను బహుకరించారు. ఆమెను 'ఉక్కు మహిళ' అని ట్యాగ్ చేశారు. సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గిఫ్ట్ ను పంచుకుంది. రాహుల్ రవీంద్రన్ కు ధన్యవాదాలు తెలిపింది.
రాహుల్ సామ్‌ని ప్రశంసిస్తూ 'ఉక్కు మహిళ' అని రాశాడు. 'ఉక్కు మహిళ సొరంగం చీకటిగా ఉంది. దానికి ముగింపు లేదని తెలుస్తోంది. వెలుగు కనిపించే సూచన లేదు. మీ పాదాలు బరువెక్కాయి.. కానీ మీరు వాటితోనే నడుస్తున్నారు. నీ సందేహాలను, భయాందోళనలను నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు ఉక్కుతో తయారయ్యావు. ఈ విజయం నీ జన్మహక్కు, నువ్వు నడుస్తూనే ఉండు. త్వరలో సూర్యుడి వెలుగు ప్రకాశిస్తుంది. ఇలాంటివి చాలానే ఉంటాయి. మీలాంటి యోధులు మాత్రమే పోరాటంలో గెలుస్తారు.' అంటూ రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన గిఫ్ట్ లో ఉంది.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయితో సమంతకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సమంత పాత్రలకు చిన్మయి డబ్బింగ్ కూడా చెబుతుంది. రాహుల్ రవీంద్రన్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతా రామం చిత్రంలో ఇటీవల కనిపించాడు. ఇప్పుడు మలయాళ బ్లాక్ బస్టర్ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీని తమిళ భాషలో రీమేక్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇందులో తాను ప్రధాన పాత్రలో, ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించారు.