Karthik on Rahul tripathi: కోహ్లీని రాహుల్ త్రిపాఠి భర్తీ చేస్తాడు.. దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు
Karthik on Rahul tripathi: టీమిండియాలో విరాట్ కోహ్లీ ఆడే మూడో స్థానాన్ని భర్తీ చేసేది రాహుల్ త్రిపాఠినేనని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్, శ్రీలంకతో సిరీస్‌లో అతడు అద్భుతంగా ఆడాడని కొనియాడాడు.
Karthik on Rahul tripathi: టీమిండియా ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు శ్రీలంకతో సిరీస్‌లోనూ అదిరిపోయే ప్రదర్శనతో భారత ఆటగాళ్లు రాణించారు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైతం సెంచరీలతో అదరగొట్టారు. అంతేకాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి లాంటి ఆటగాళ్లు సైతం మెరుగ్గా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టీమిండియా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ స్పందించాడు. కోహ్లీ అందుబాటులో లేనప్పుడు ఆ స్థానాన్ని రాహుల్ త్రిపాఠితో భర్తీ చేయొచ్చని స్పష్టం చేశాడు.
"రాహుల్ త్రిపాఠి ప్రత్యేకత అతడి డీఎన్ఏలోనే ఉంది. ఎలాంటి పరిస్థితులోనైనా అతడు ఒత్తిడిని అధిగమించి ఆడగలడు. ఎలాంటి గేమ్ అయినా సరే అలాంటి ఆటగాడు జట్టులో ఉండాలి. పెద్ద మ్యాచ్‌ల్లో అతడు తప్పకుండా రాణిస్తాడని అనుకుంటున్నా. మనం గత 3 లేదా 6 నెలల కాలాన్ని మర్చిపోకూడదు. వచ్చే ఐపీఎల్‌లోనూ మూడో స్థానంలో అతడు మెరుగ్గా రాణిస్తాడు. విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కాకుండా అతడు అందుబాటులో లేనప్పుడు మొదటి ఛాయిస్ రాహుల్ త్రిపాఠినేనని నేను అనుకుంటున్నా. ఇంకెవ్వరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు" అని స్పష్టం చేశాడు.
రాహుల్ త్రిపాఠి దూకుడైన ఆటగాడని, అతడు జట్టులో తప్పకుండా ఉండాలని దినేశ్ కార్తిక్ అన్నాడు. "జట్టులోకి వచ్చిన ప్రతిసారి నిస్వార్థంగా ఆడతాడు. దూకుడైన ఆటగాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టులో అతడి అవసరం ఎంతైనా ఉంది. శ్రీలంకతో సిరీస్‌లో రాహుల్ అద్భుతంగా ఆడాడు. అతడికి ఇతరుల మాదిరిగా ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పటికీ అదే దూకుడును కొనసాగిస్తూ ఆడుతున్నాడు. కెప్టెన్, కోచ్‌కు ఎలాగైతే కావాలనుకుంటున్నారో ఆ విధంగా అతడి ప్రదర్శన ఉంది." అని దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్‌లో మాత్రం 2-1 తేడాతో గెలిచింది. అనంతరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.