Dil Raju: నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..కార్తికేయ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు-dil raju slams media for blaming him karthikeya 2 release delay ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dil Raju Slams Media For Blaming Him Karthikeya 2 Release Delay

Dil Raju: నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..కార్తికేయ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు

Maragani Govardhan HT Telugu
Aug 17, 2022 08:06 AM IST

కార్తికేయ 2 సక్సెస్ మీట్ హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిర్మాతలమధ్య ఆరోగకరమైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు.

దిల్ రాజు
దిల్ రాజు (Twitter)

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ బడా నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. కార్తికేయ 2 ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు చిత్రబృందాని కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో సినిమా విడుదల విషయంలో వస్తున్న వదంతులపై కూడా స్పందించారు. కొంతమంది వ్యూస్ కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

"ఇండస్ట్రీకి కొత్త ఊపిరిలూదిన కార్తికేయ 2 చిత్రబృందానికి శుభాకాంక్షలు. బింబిసార, సీతారామం ఇప్పుడు కార్తికేయ. ఎలాంటి కథల్ని ఎంపిక చేసుకోవాలో అనే విషయంలో ఈ సినిమాలు మాకు స్ఫూర్తిగా నిలిచాయి. ఈ సినిమా విడుదలపై నేనూ, నిఖిల్ చాలా రోజులు చర్చించాం. జులై 8న మా సినిమా థ్యాంక్యూను విడుదల చేయాలనుకున్నాం. కుదర్లేదు. అప్పుడు కార్తికేయ 2 నిర్మాతల్లో ఒకరైన వివేక్‌కు ఫోన్ చేసి మీ సినిమాను జులై 22న విడుదల చేయాలనుకుంటున్నారు కదా. మాకు అవకాశం ఇస్తారా? అని అడిగా. సినిమాల మధ్య క్లాష్ లేకుండా ఉండేందుకు మేము ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో మాట్లాడుతుంటాం. కార్తికేయ 2 విషయంలోనూ ఇదే చేశాం." అని దిల్ రాజు స్పష్టం చేశారు.

వివేక్‌తో మాట్లాడిన అనంతరం నిఖిల్, చందూ మొండేటి తన ఇంటికి వచ్చి సినిమా విడుదలకు అంగీకరించారని దిల్ రాజు అన్నారు. వారికి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పానని, ఆ విధంగా కార్తికేయ 2ను ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారని స్పష్టం చేశారు.

"కార్తికేయ 2 సినిమాను కావాలనే తొక్కేస్తున్నారు అంటూ తమకు ఇష్టమొచ్చినట్లు రాశారు. ఏ సినిమా ఆడినా నిర్మాతలమంతా ఆనందిస్తారు. మా మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉంది. సినిమా సక్సెస్ మీట్‌లో ఇలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. మాట్లాడకపోతే చిత్రసీమలో ఐక్యత లేదనుకుంటారు. నిర్మాతలమంతా సరిగ్గా ప్లాన్ చేసుకుని సినిమాలను విడుదల చేస్తుంటాం. నాపై గతంలోనూ వదంతులు వచ్చాయి. అలాంటి వాటిని నేనెప్పుడు పట్టంచుకోను. నిఖిల్ తన కెరీర్ ప్రారంభం నుంచి నాకు తెలుసు. ఆ చనువుతోనే మళ్లీ నా వద్దకు వచ్చాడు, ఆగస్టు 12న వేరే సినిమాలు విడుదలవుతున్నాయి. ఏం చేయాలి అని అడిగాడు. డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి క్లాష్ లేకుండా ఓ రోజు ముందో, వెనకో విడుదల చేయండి అని చెప్పా. ఆ విధంగా కార్తికేయ 2 ఆగస్టు 13న విడుదలైంది. ఒక రోజు తేడాతో విడుదల కావడంతో మళ్లీ వివాదాన్ని రేకెత్తించారు" అని దిల్ రాజు చెప్పారు.

కార్తికేయ 2 సినిమాకు విడుదల పలు మార్లు వాయిదా పడింది. మొదట జులై 22న విడుదల చేయాలని భావించగా.. అదే సమయంలో థ్యాంక్యూ సినిమా రానుండటంతో అప్పుడు వాయిదా పడింది. దీంతో కార్తికేయ 2 విడుదల ఆలస్యం కావడానికి దిల్‌రాజే కారణమని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్