Netflix OTT: నయనతార వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ని కూడా లాగిన హీరో ధనుష్.. 24 గంటలు టైమ్ ఇస్తూ నోటీసులు-dhanush lawyer releases statement after nayanthara open letter on netflix documentary nayanthara beyond the fairytale ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: నయనతార వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ని కూడా లాగిన హీరో ధనుష్.. 24 గంటలు టైమ్ ఇస్తూ నోటీసులు

Netflix OTT: నయనతార వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ని కూడా లాగిన హీరో ధనుష్.. 24 గంటలు టైమ్ ఇస్తూ నోటీసులు

Galeti Rajendra HT Telugu
Nov 18, 2024 07:04 PM IST

Nayanthara: Beyond the Fairytale documentary: నయనతార, ధనుష్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ను కూడా లాగిన ధనుష్.. 24 గంటల గడువు ఇచ్చారు.

ధనుష్, నయనతార
ధనుష్, నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతారతో వివాదంలోకి నెట్‌ఫ్లిక్స్‌ని కూడా హీరో ధనుష్ లాగేస్తూ సోమవారం మరో నోటీసు పంపారు. గత రెండు రోజులుగా నయనతార, ధనుష్ మధ్య వివాదం నడుస్తుండగా.. ఆమె డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సోమవారం స్ట్రీమింగ్‌కి ఉంచింది. దాంతో ధనుష్ ఈరోజు తన లాయర్‌ ద్వారా మరో నోటీసు పంపారు.

నోటీసులకి లేఖతో నయన్ రిప్లై

నయనతార డాక్యుమెంటరీలో ‘నేనూ రౌడీనే’ సినిమాలోని 3 సెకన్ల క్లిప్‌ను వాడారు. దాంతో కాపీ రైట్ యాక్ట్ కింద రూ.10 కోట్లు చెల్లించాలని ఆ మూవీ నిర్మాతైన ధనుష్ ఇటీవల నయనతారకి నోటీసులు పంపారు. దాంతో చిర్రెత్తిపోయిన నయనతార.. ధనుష్‌కి ఘాటుగా రిప్లై ఇస్తూ సోషల్ మీడియాలో ఒక లేఖని విడుదల చేసింది. అందులో ధనుష్ మనస్తత్వాన్ని ఎండగడుతూ.. నాపై కక్ష సాధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో డాక్యుమెంటరీ నుంచి ఆ క్లిప్‌ను తొలగిస్తారని అంతా అనుకున్నారు.

క్లిప్‌ను తొలగించేందుకు నిరాకరణ

కానీ.. నెట్‌ఫ్లిక్స్ సోమవారం స్ట్రీమింగ్‌కి ఉంచిన డాక్యుమెంటరీలో ఆ క్లిప్‌ అలానే ఉంది. దాంతో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కి కూడా మరోసారి వార్నింగ్ ఇస్తూ ధనుష్ నోటీసులు పంపారు. 24 గంటల్లోపు ఆ క్లిప్‌ను డాక్యుమెంటరీ నుంచి తొలగించకపోతే రూ.10 కోట్ల నష్టపరిహారానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ని ఆ నోటీసుల్లో ధనుష్ హెచ్చరించారు.

సెంటిమెంట్‌‌గా భావిస్తున్న నయనతార

వాస్తవానికి పర్సనల్ లైఫ్‌లో నేనూ రౌడీనే సినిమా నయనతారకి చాలా కీలకంగా మారింది. ఆ సినిమాకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించగా.. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లోనే నయన్, విఘ్నేశ్ ప్రేమలో పడి.. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ సేతుపతి హీరోగా చేసిన ఆ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో విఘ్నేశ్ కెరీర్ గాడినపడినా.. ప్రొడ్యూసర్‌గా ధనుష్‌కి మాత్రం పెద్దగా లాభాలు రాలేదు. దానికి కారణం.. సినిమా అంచనాల్ని మించి బడ్జెట్ పెరిగిపోవడమే.

రెండో నోటీసుకి నయన్ రియాక్ట్ అవుతుందా?

నేనూ రౌడీనే సినిమా తర్వాత నయనతార, ధనుష్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూ వచ్చింది. దాంతో డాక్యుమెంటరీలో క్లిప్‌ను వాడుకోవడానికి అనుమతి కోరినా.. ధనుష్ నిరాకరించారు. అయినప్పటికీ ఆ సినిమా విఘ్నేశ్‌, తనని కలపడంతో నయనతార సెంటిమెంట్‌గా డాక్యుమెంటరీలో ఆ క్లిప్‌ను తొలగించలేదు దాంతో ధనుష్ మళ్లీ నోటీసులు పంపారు. మరి నయనతార మళ్లీ ఎలా రియాక్ట్ అవతారో చూడాలి.

Whats_app_banner