Devil Review: డెవిల్ రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన పూర్ణ హారర్ మూవీ ఎలా ఉందంటే?
Devil Review: పూర్ణ, విదార్థ్, త్రిగుణ్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ డెవిల్ ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే...

అలెక్స్, హేమ పెళ్లి కథ...
అలెక్స్ (విదార్థ్) ఓ బిజినెస్‌మెన్. హేమతో (పూర్ణ) పెద్దలు అతడి పెళ్లిని జరిపిస్తారు. పెళ్లికిముందు నుంచే అలెక్స్ తన ఆఫీస్‌లోనే పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ సోఫియాతో (శుభశ్రీ) రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. సోఫియా మాయలో పడి హేమను నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఓ రోజు అలెక్స్ కోసం లంచ్ తీసుకొని అతడి ఆఫీస్‌కు వస్తుంది హేమ. అలెక్స్, సోఫియా ఆఫీస్‌లోనే రొమాన్స్ చేసుకుంటూ హేమ కంటపడతారు.
భర్తపై కోపంతో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తోన్న టైమ్‌లో పరధ్యానంగా డ్రైవింగ్ చేస్తూ రోషన్ (త్రిగుణ్) అనే వ్యక్తికి యాక్సిడెంట్ చేస్తుంది హేమ. ఆ యాక్సిడెంట్ కారణంగా హేమ, రోషన్ మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారుతుంది. గాయం నుంచి కోలుకునే వరకు రోషన్ బాగోగులు చూసుకుంటుంది హేమ. ఆమె ఫ్రెండ్‌షిప్‌ను రోషన్ ప్రేమగా భావిస్తాడు.
అలెక్స్‌ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూనే మరో వ్యక్తికి దగ్గరవుతుంది సోఫియా. ఆమె మోసాన్ని కనిపెట్టిన అలెక్స్ సోఫియాకు బ్రేకప్ చెబుతాడు. హేమ ప్రేమను అర్థం చేసుకున్న అలెక్స్ ఆమెకు దగ్గర అవుతాడు.
అలెక్స్, హేమ కాపురం సజావుగా సాగిపోతుండగా వారి జీవితంలోకి రోషన్ వస్తాడు. అలెక్స్‌ను చంపేస్తాడు? ఆ తర్వాత ఏమైంది? హేమ ప్రేమ కోసం అలెక్స్‌ను హత్య చేసిన రోషన్ ఆ తర్వాత కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? వివాహేతర సంబంధాలు ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి కల్లోలాల్ని రేపాయి? దేవుడు రూపంలో ఉన్న మనిషి సహాయంతో కాలంలో ముందుకు వచ్చిన హేమ తన భర్తను కాపాడుకుందా? లేదా? అన్నదే డెవిల్ మూవీ కథ.
జోనర్ చెప్పడం కష్టమే...
కొన్ని సినిమాలను పోస్టర్ చూసే ఇది ఫలానా జోనర్ మూవీ అని చెప్పొచ్చు. కొన్నింటిని సినిమా మొత్తం చూసిన కూడా అది ఏ జోనర్ మూవీ అన్నది తేల్చిచెప్పడం కష్టంగా ఉంటుంది. డెవిల్ అలాంటి మూవీనే.
ఆల్ జోనర్స్ మిక్స్...
వివాహేతర సంబంధాల వల్ల తలెత్తే అనర్థాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు ఆథియా డెవిల్ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్‌ను స్క్రీన్‌పై చెప్పడానికి అన్ని జోనర్స్ వాడుకున్నాడు. లవ్‌స్టోరీతో సినిమా మొదలై...ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాగా టర్న్ తీసుకొని. హారర్ జోనర్‌లోకి ఎంటరవుతుంది.
చివరకు డివోషనల్ ట్రైమ్ ట్రావెల్ ఎలిమెంట్‌తో సినిమాను ఎండ్ చేశాడు. సినిమా రిజల్ట్‌ను పక్కనపెడితే గంట యాభై ఆరు నిమిషాల నిడివితో కూడిన సినిమాలో అన్ని జోనర్స్ మిక్స్ చేసిన దర్శకుడి టాలెంట్‌ను మాత్రం మెచ్చుకోవచ్చు.
భార్యాభర్తల సంఘర్షణ…
భార్యాభర్తల మధ్య సంఘర్షణ చుట్టూ కథను అల్లుకున్నాడు దర్శకుడు. కొన్ని ఊహించని పరిచయాలు, అనుబంధాలు జీవితంలో ఎలాంటి కల్లోలాన్ని రేపుతాయి? భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే ఏం జరుగుతుంది? వివాహేతర సంబంధాల వెనుక తప్పు ఎవరిది ఉంటుందన్నది డెవిల్ సినిమాలో చూపించాలని దర్శకుడు అనుకున్నాడు.
దర్శకుడు కన్ఫ్యూజన్...
ఈ పాయింట్‌ను చెప్పడంలో దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. రోషన్, హేమ లవ్ స్టోరీ టీవీ సీరియల్‌ను తలపిస్తుంది. అలెక్స్, సోఫియా ట్రాక్‌ను రొమాంటిక్ సీన్స్‌తో నింపేశారు. హారర్ ఎలిమెంట్ వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉన్న రెండు, మూడు హారర్ సీన్స్ భయపెట్టలేకపోయాయి. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.సినిమాను ఎలా ఎండ్ చేయాలో తెలియక టైమ్ లూప్‌ను వాడుకున్న ఫీలింగ్ కలుగుతుంది.
పూర్ణకు ఎక్కువ మార్కులు...
సాదాసీదా కథకు న్యాయం చేయడానికి పూర్ణతో పాటు విదార్థ్, త్రిగుణ్ చాలా కష్టపడ్డారు. యాక్టింగ్ పరంగా పూర్ణకే ఎక్కువగా మార్కులు పడతాయి. భర్త ప్రేమకు దూరమై మరో యువకుడి దగ్గరై ప్రతి క్షణం మదనపడే మహిళ పాత్రలో ఎమోషనల్ యాక్టింగ్‌తో మెప్పించింది.
జోవియల్ లైఫ్‌స్టైల్‌కు అలవాటుపడిన మోడ్రన్ యువకుడిగా త్రిగుణ్ నటన ఒకే అనిపిస్తుంది. అలెక్స్ పాత్రలకు విదార్థ్ సరిగా సెట్టవ్వలేదు. శుభశ్రీ అందాల ఆరబోత ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. ఓ గెస్ట్ పాత్రలో డైరెక్టర్ మిస్కిన్ కనిపించాడు.ఆర్ట్ ఫిలిమ్ ఫీల్ ఇవ్వడానికి కెమెరామెన్ తెగ కష్టపడ్డాడు. ఈ మూవీతోనే డైరెక్టర్ మిస్కిన్ సంగీత దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సీన్‌కు సంబంధం లేకుండా అతడి బీజీఎమ్ సాగుతుంది.
పేరుకే హారర్ మూవీ...
డెవిల్ పేరులో ఉన్న హారర్ థ్రిల్లర్ మూవీలో కనిపించదు. టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా కథ, కథనాల్లో మాత్రం కొత్తదనం మిస్సయింది.