Devara Tickets: రెండే రెండు నిమిషాల్లో టికెట్లన్నీ హాంఫట్.. దేవర క్రేజ్ మామూలుగా లేదు
Devara Tickets: దేవర మూవీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇదొక్క ఉదాహరణ చాలు. రెండే రెండు నిమిషాల్లో ఏకంగా 27 షోల టికెట్లు అమ్ముడుపోయాయంటే నమ్మగలరా? జూనియర్ ఎన్టీఆర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతలా వేచి చూస్తున్నారో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
Devara Tickets: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన విషయం తెలుసు కదా. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో రెండే నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోవడం గమనార్హం.
దేవర టికెట్లకు ఫుల్ డిమాండ్
దేవర మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. దీనికోసం సోమవారం (సెప్టెంబర్ 23) టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. సహజంగానే తొలి రోజు చాలా వరకూ మల్టీప్లెక్స్ లలో పదుల సంఖ్యలో షోలు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో అయితే తొలి రోజు మొత్తంగా 27 షోలు ఉన్నాయి.
ఉదయం 7.55 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మొత్తంగా 27 షోలు వేస్తుండం విశేషం. అయితే ఇన్ని షోలు ఉన్నా, టికెట్ల ధరలను భారీగా పెంచినా కూడా కేవలం రెండే నిమిషాల్లో ఈ టికెట్లన్నీ అమ్ముడైపోయాయంటే నమ్మగలరా? దేవర మూవీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇదొక్క ఉదాహరణతోనే మనకు అర్థమైపోతోంది.
టికెట్ల ధర పెంపు.. అర్ధరాత్రి షోలు
దేవర మూవీ టికెట్ల ధరలను పెంచడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో అయితే గరిష్ఠంగా ఈ ధరలు రూ.413 వరకూ ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్ లోనూ రూ.400 నుంచి రూ.500 మధ్య టికెట్ల ధరలను చూపిస్తోంది. ఈ టికెట్లు కూడా ఎగబడి కొనేస్తున్నారు. తొలి రోజు మాత్రమే ఈ ధరలు ఉంటాయి.
ఇక సింగిల్ స్క్రీన్లలో అయితే గరిష్ఠంగా రూ.297 వరకూ ఉండటానికి అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా అర్ధరాత్రి ఒంటి గంటకే షోలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మొత్తంగా 29 థియేటర్లు ఈ అర్ధరాత్రి షోలు వేయనున్నాయి. ఇక రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే తొలి రోజే దేవర మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రెండున్నరేళ్లకు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని ఈ దేవర ద్వారా చూపించబోతున్నాడు. మూవీ నుంచి రిలీజైన రెండు ట్రైలర్లు అసలు సినిమా ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టాయి. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయినా.. సినిమాకు అభిమానుల్లో ఉన్న క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు.
అటు జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ప్రమోషన్లలో కోసం యూఎస్ వెళ్లాడు. అక్కడ లాస్ ఏంజెల్స్ లోని ఫిల్మ్ ఫెస్టివల్లో దేవర వరల్డ్ ప్రీమియర్ షోని అతడు చూడనున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటీనటులు నటించిన విషయం తెలిసిందే.