Devara Chuttamalle Song: ఎన్టీఆర్, జాన్వీ నయా రొమాంటిక్ పోస్టర్ రివీల్.. దేవర రెండో సాంగ్ ‘చుట్టమల్లే’ రిలీజ్ టైమ్ ఇదే
Devara second single - Chuttamalle song: దేవర సినిమా నుంచి ఎంతో ఎదురుచూస్తున్న రెండో పాట వచ్చేస్తోంది. నేడే (ఆగస్టు 5) ఈ సాంగ్ రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఓ నయా పోస్టర్‌ను మూవీ టీమ్ తీసుకొచ్చింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న దేవర సినిమా నుంచి రెండో పాట కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ అధికంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దేవర నుంచి రెండో పాట నేడు (ఆగస్టు 5) రిలీజ్ కానుంది. ఈ తరుణంలో పాట పేరుతో పాటు ఎన్టీఆర్, జాన్వీ ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ నేడు తీసుకొచ్చింది.
పోస్టర్ ఇలా..
దేవర నుంచి రెండో సాంగ్ వస్తున్న సందర్భంగా మూవీ టీమ్ కొత్త పోస్టర్ రివీల్ చేసింది. ఎన్టీఆర్, జాన్వీతో ఈ నయా పోస్టర్ ఉంది. సముద్ర తీరాన రొమాంటిక్‍గా ఈ పోస్టర్ ఉంది. గ్లామరస్‍గా చీర కట్టులో జాన్వీ ఉండగా.. ఆమె వెనుక వైపున ఎన్టీఆర్ నిల్చొని చేతిని పట్టుకున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్, జాన్వీ లుక్ సూపర్‌గా ఉంది. ఈ పాటలో వీరి కెమిస్ట్రీ అదిరిపోయేలా కనిపిస్తోంది.
పాట పేరు.. రిలీజ్ టైమ్
దేవర సినిమా నుంచి ఈ రెండో పాట నేడు (ఆగస్టు 5) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. తెలుగులో ‘చుట్టమల్లే’ పేరుతో ఈ పాట రానుంది. తెలుగులో ఈ సాంగ్‍ను శిల్పా రావ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. హిందీ, తమిళంలో, కన్నడ, మలయాళంలోనూ ఈ పాట రిలీజ్ కానుంది. ఆయా భాషల్లో లిరిక్స్ రైటర్స్ వేర్వేరుగా ఉన్నారు. హిందీలో ‘ధీరే.. ధీరే’ అంటూ ఈ పాట ఉండనుంది.
దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘ఫియర్ సాంగ్’ చార్ట్ బస్టర్ అయింది. ఈ మూవీకి ఉన్న హైప్‍ను మరింత పెంచేసింది. ఎనర్జిటిక్ ట్యూన్‍తో అనిరుధ్ మెప్పించాడు. అయితే, రొమాంటిక్ మెలోడీ సాంగ్‍గా ఉన్న ఈ ‘చుట్టమల్లే’ సాంగ్‍కు ఎలా స్వరపరిచాడో అనే ఆసక్తి ఉంది. మాస్, ట్రెండీ పాటలకు అనిరుధ్ ఇప్పటి వరకు బాగా మెప్పించాడు. అయితే, మెలోడీల్లో అంతగా మార్క్ చూపలేదు. దీంతో దేవరలో ఈ రెండో పాట ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అధికంగా నెలకొంది.
జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడాన్ని చాలా ఎంజాయ్ చేశానని జాన్వీ కపూర్ ఇటీవలే ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆయన గ్రేట్ డ్యాన్సర్ అని ప్రశంసించారు. దేవరతోనే తెలుగులోకి జాన్వీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే, ఈ చుట్టమల్లే పాటనే తెలుగులో ఆమెకు మొదటిది కానుంది.
దేవర సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దేవర రిలీజ్ కానుంది.