Devara Postponed: దేవర రిలీజ్ వాయిదా పడడం ఖాయమేనా! ఈ రెండు కారణాల వల్ల..
Devara Postponed: దేవర సినిమా విడుదల వాయిదా పడడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త విడుదల తేదీ రానుందని టాక్. ఆ వివరాలివే..
Devara Postponed: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇటీవల వచ్చిన గ్లింప్స్ అదిరిపోవడంతో దేవరపై అంచనాలు మరింత పెరిగాయి. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో దేవరపై బజ్ నెక్స్ట్ లెవెల్‍లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్-1 రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో చెప్పారు. అయితే, విడుదల వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది.
దేవర పార్ట్-1 సినిమా ఏప్రిల్ 5వ తేదీన రావడం లేదని సమాచారం. ఈ సినిమాను రిలీజ్‍ను వాయిదా వేయాలని మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసిందని టాక్. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించేందుకు టీమ్ రెడీ అవుతోంది. అన్ని విషయాలను అంచనా వేసుకొని కొత్త రిలీజ్ డేట్‍ను వెల్లడించనుందని తెలుస్తోంది.
వీఎఫ్‍ఎక్స్ కోసం..
దేవర చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ భారీగా ఉండనుంది. ఓ పక్క షూటింగ్ జరుగుండగానే.. గ్రాఫిక్స్ పనులు కూడా సాగుతున్నాయి. అయితే, వీఎఫ్ఎక్స్ కోసం అంచనా వేసిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని సమాచారం బయటికి వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లో బెస్ట్ ఔట్‍పుట్ ఇవ్వాలని దేవర టీమ్ నిశ్చయించుకుందని టాక్.
దేవర విజువల్స్ విషయంలో మేకర్స్ అసలు రాజీ పడడం లేదని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాతి మూవీ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో రిలీజ్ ఆలస్యమైన పర్వాలేదని మూవీ టీమ్ భావిస్తోంది.
సైఫ్‍కు సర్జరీ
చేతికి గాయం కారణంగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సర్జరీ చేయించుకున్నారు. దేవర మూవీలో విలన్ పాత్ర చేస్తున్నారు సైఫ్. ఇంకా మూవీ షూటింగ్ కాస్త మిగిలే ఉంది. సైఫ్ మళ్లీ షూటింగ్‍కు వచ్చేందుకు కాస్త సమయం పట్టనుంది. దీంతో చిత్రీకరణను కూడా మూవీ టీమ్ వాయిదా వేసింది. సైఫ్ కోలుకున్నాకే షూటింగ్‍కు రానున్నారు. దేవర చిత్రం ఆలస్యమయ్యేందుకు ఇది కూడా ఓ కారణంగా ఉంది.
దేవర గ్లింప్స్ జవనరి 8వ తేదీన రిలీజ్ అయింది. సముద్రాన్ని రక్తంతో ఎరుపెక్కించేలా యాక్షన్ సీక్వెన్స్‌తో అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ యాక్షన్, స్వాగ్ అదిరిపోయాయి. “ఈ సముద్రం చేపల కంటే కత్తులను, నెత్తురు ఎక్కువగా చూసి ఉండాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు” అంటూ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ కూడా పవర్‌ఫుల్‍గా ఉంది. సముద్రపు కెరటాలు రక్తంతో ఎర్రగా మారడం చూస్తుంటే దేవర మూవీలో యాక్షన్ ఏ రేంజ్‍లో ఉంటుందో అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, నరైన్, కలైరాసన్, మురళీ శర్మ కీలకపాత్రలు చేస్తున్నారు. దేవర మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ కావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ నిర్ణయించుకుంది. దేవర చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉండనుంది.