Devara Breakeven: భారీస్థాయిలో దేవర థియేట్రికల్ బిజినెస్.. బ్రేక్ఈవెన్ కోసం తెలుగులో ఎంత రావాలంటే?
Devara Breakeven: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ ఊహించినట్లే భారీ థియేట్రికల్ బిజినెస్ చేస్తోంది. దీంతో బ్రేక్ఈవెన్ టార్గెట్ కూడా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజ్ కానున్నా తెలుగులోనే థియేట్రికల్ హక్కులు భారీ మొత్తం పలికాయి.
Devara Breakeven: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ దేవర మూవీ ముందు చెప్పినదాని కంటే ముందే రిలీజ్ కానుందని ఈ మధ్యే మేకర్స్ చెప్పిన విషయం తెలుసు కదా. పవన్ కల్యాణ్ ఓజీ వాయిదా పడే ఛాన్స్ ఉండటంతో ఆ సినిమా రావాల్సిన సెప్టెంబర్ 27నే దేవరను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేయడం విశేషం.

దేవర బ్రేక్ఈవెన్ భారీగానే..
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరగడానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల్లో దేవర డిస్ట్రిబ్యూషన్ హక్కుల మొత్తం రూ.110 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఏపీలో సితారా ఎంటర్టైన్మెంట్స్ థియేట్రికల్ హక్కులను సంపాదించింది. ఇక తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ హక్కుల విలువ రూ.110 కోట్లు కాగా.. ఓవర్సీస్ హక్కులు మరో రూ.27 కోట్లు పలికాయి. దీంతో ఈ సినిమా కేవలం తెలుగు వెర్షనే రూ.150 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ వసూలు చేస్తే కానీ హిట్ జాబితాలో నిలవదు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తమే అని చెప్పాలి.
థాయ్‌లాండ్‌కు దేవర
మరోవైపు దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా.. షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఓ సాంగ్ షూట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలిసింది. అతడు తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. మరోవైపు జాన్వీ కపూర్ కూడా థాయ్ షెడ్యూల్లో పాల్గొననుంది. అక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత తారక్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయనున్నాడు.
దేవర మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే చాలాసార్లు మారిన విషయం తెలిసిందే. మొదట ఈ ఏడాది ఏప్రిల్ 5నే వస్తుందని భావించారు. తర్వాత అక్టోబర్ 10కి వాయిదా వేశారు. తాజాగా మరోసారి రిలీజ్ డేట్ ను రెండు వారాలు ముందుకు జరిపి.. సెప్టెంబర్ 27న రిలీజ్ అని తేల్చేశారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. గోవాలో ఇటీవలే ఓ సుదీర్ఘ షెడ్యూల్ ముగిసింది. త్వరలోనే మరో షెడ్యూల్ షురూ కానుంది. జూలై నెలాఖరు లేకపోతే ఆగస్టు మొదట్లో దేవర షూటింగ్‍ను పూర్తి చేయాలని మూవీ టీమ్ టార్గెట్‍గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫియర్ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నాయి.