Kapil Show OTT: ఎన్టీఆర్ మాటలకు పడి పడి నవ్విన జాన్వీ.. కపిల్ శర్మ షో ప్రోమో చూసేయండి: స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
The Great Indian Kapil Show: ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో దేవర టీమ్ సందడి చేసింది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో సరదాగా ఉంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.
దేవర సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. మరో 48 గంటల్లోనే సెప్టెంబర్ 27న ఈ హైవోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ రిలీజ్ కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రంపై తెలుగుతో పాటు హిందీలోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలో హిందీలోనూ జోరుగా ప్రమోషన్లు చేశారు ఎన్టీఆర్. ఇందులో భాగంగా ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో పాటు ఈ మూవీలో హీరోయిన్‍గా నటించిన జాన్వీ కపూర్, భైర పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ కూడా షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది.
కూర్చొబెడతారా.. లేదా..
నార్త్, సౌత్ కలిస్తే మజా డబుల్ అవుతుందని కపిల్ శర్మ చెప్పడంతో ఈ ప్రోమో మొదలైంది. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఎన్టీఆర్ తన మార్క్ చమత్కారంతో నవ్వించారు. ఇంట్రడక్షన్‍లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‍ను నిలబెట్టి మాట్లాడారు హోస్ట్ కపిల్ శర్మ. ఎక్కువసేపు అవటంతో ఎన్టీఆర్ పంచ్ వేశారు. “నాకు ఐదు నిమిషాల నుంచి అనిపిస్తోంది. నన్ను కూర్చోబెడతారా.. లేదా” అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో రండి.. రండి.. ప్లీజ్ అంటూ కూర్చోబెట్టారు కపిల్ శర్మ.
ఫేవరెట్ హీరోయిన్
నార్త్‌లో తనకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఎన్టీఆర్‌ను కపిల్ అడిగారు. దీంతో ఎప్పటికీ శ్రీదేవి అని ఎన్టీఆర్ ఆన్సర్ చెప్పారు. అయితే, “సౌత్ కోసం నేను శ్రీదేవి అని ఆన్సర్ చెప్పాలనుకున్నా” అని సైఫ్ అన్నారు.
తన తల్లి దేవితో పెళ్లయ్యాక తన తండ్రి (బోనీ కపూర్) అప్పటికే సౌత్‍లా మారిపోయారని, ఉదయమే లేచి అలూ పరాఠా బదులు ఇడ్లీ సాంబర్ తినే వారని జాన్వీ కపూర్ చెప్పారు. చివరికి తన తల్లి (శ్రీదేవి) నార్త్ ఇండియన్‍లా ఉండేవారని అన్నారు. దీంతో ఎన్టీఆర్ గట్టిగా నవ్వారు. సుమారు రెండు దశాబ్దాల పాటు దక్షిణాది.. ఆ తర్వాత బాలీవుడ్‍లో అగ్ర హీరోయిన్‍గా వెలుగొందిన దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ.. దేవర మూవీతో టాలీవుడ్‍లో అడుగుపెడుతున్నారు.
ఒక్క ముక్క కూడా పంపలేదు.. నవ్వేసిన జాన్వీ
సన్నీ డియోల్ పేరును సైఫ్ అలీ ఖాన్ గుర్తించేలా యాక్టింగ్ చేశారు ఎన్టీఆర్. గదర్ 2లో సుత్తిని పట్టుకున్నట్టుగా చేశారు. తాను హైదరాబాద్‍లో జాన్వీకి రెండుసార్లు మంచి ఫుడ్ పంపించానని, ముంబై వస్తే జాన్వీ ఒక్క ముక్క ఫుడ్ కూడా ఇప్పలేదని ఎన్టీఆర్ అన్నారు. దీంతో జాన్వీ పడి పడి నవ్వారు.
“హైదరాబాద్‍లో షూటింగ్ చేసేటప్పుడు రెండుసార్లు నేను జాన్వీకి మంచి ఆహారం పంపా. నేను ఇక్కడికి వచ్చి ఒక రోజు అయింది. ఒక్క ముక్క కూడా రాలేదు. ఆమె చేతి వంట లేదనుకున్నా.. కనీసం హోటల్ నుంచి డెలివరీ కూడా తెప్పించలేదు” అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో జాన్వీ గట్టిగా నవ్వారు.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్న ఈ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎపిసోడ్ ఈ శనివారం సెప్టెంబర్ 28వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానుంది.
దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు.సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందించారు.