పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ దేవా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
దేవా మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. మలయాళంలో విజయవంతమైన ముంబై పోలీస్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
షాహిద్ కపూర్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చినా క్లైమాక్స్‌తో పాటు స్క్రీన్‌ప్లే విషయంలో దారుణంగా విమర్శలొచ్చాయి. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 60 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్, విశాల్ మిశ్రా మ్యూజిక్ అందించారు.
మలయాళం మూవీ ముంబై పోలీస్‌ను కూడా రోషన్ ఆండ్రూస్ రూపొందించాడు. ఒరిజినల్‌తో పోలిస్తే దేవాలో పలు మార్పులు చేశాడు. క్లైమాక్స్‌లో హీరోను గే క్యారెక్టర్‌లో కాకుండా డిఫరెంట్‌గా ప్రజెంట్ చూపించే ప్రయత్నం చేశాడు.
దేవా నిజాయితీపరుడైన డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్. గ్యాంగ్‌స్టర్ ప్రభాత్ జాదవ్‌ను (మనీష్ వంధ్యా) పట్టుకునే టీమ్‌కు హెడ్‌గా ఉంటాడు. ప్రభాత్‌ను పట్టుకోవడానికి దేవా వేసిన ప్లాన్స్ చాలా వరకు ఫెయిలవుతుంటాయి. చివరకు ప్రభాత్ జాదవ్‌ను పట్టుకున్న దేవా అతడిని షూట్ చేసి చంపేస్తాడు. తన స్నేహితుడైన రోహన్ డిసిల్వా (పావైల్ గులాటీ) ఈ ఎన్‌కౌంటర్ చేశాడని పై అధికారులకు చెబుతాడు.
రోహన్ ధైర్యసాహసాలకుగాను అతడికి గాలెంటరీ అవార్డు వస్తుంది. ఈ అవార్డు అందుకునే టైమ్‌లోనే రోహన్ హత్యకు గురవుతాడు. . రోహన్ మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌లో దేవాకు ఎలాంటి నిజాలు తెలిశాయి? దేవా గురించి బయటపడ్డ షాకింగ్ నిజం ఏమిటి? జర్నలిస్ట్ దియాకు దేవాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
ముంబై పోలీస్ మూవీ తెలుగులోనే హంట్ పేరుతో రీమేక్ అయ్యింది. బాలీవుడ్‌లో మోస్తారు వసూళ్లను రాబట్టిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్‌గా నిలిచింది.
ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న పూజా హెగ్డే మళ్లీ బిజీ అయ్యింది. దేవా తర్వాత బాలీవుడ్‌లో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా చేస్తోంది. తమిళంలో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. నాలుగు సినిమాలు చేస్తోంది. సూర్య రెట్రో, దళపతి విజయ్ జన నాయగన్‌తో పాటు కాంచన 4 సినిమాలు చేస్తోంది. రజనీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది.
సంబంధిత కథనం