Horror Thriller: కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ -క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్
Horror Thriller Movie: బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ డిమాంటి కాలనీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. అరుళ్‌నిధి హీరోగా నటించిన ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా రిలీజైన డిమాంటి కాలనీ పెద్ద విజయాన్ని సాధించి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.
Horror Thriller Movie: 2015లో తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది డిమోంటి కాలనీ. అరుళ్ నిధి హీరోగా నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన డిమోంటి కాలనీ మూవీ 20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
తెలుగులో యూట్యూబ్‌లో రిలీజ్...
తెలుగులో అదే పేరుతో డిమోంటి కాలనీ డబ్ అయ్యింది. తెలుగు వెర్షన్ సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది. తాజాగా డిమోంటి కాలనీ తెలుగువెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
మౌత్‌టాక్‌తో బ్లాక్‌బస్టర్...
డిమోంటి కాలనీ మూవీతోనే అజయ్ జ్ఞానముత్తు దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో అరుళ్ నిధితో పాటు రమేష్ తిలక్, సనత్ కీలక పాత్రల్లో నటించారు. డిమాంటి కాలనీ రిలీజ్ టైమ్‌లో అరుళ్‌నిధికి హీరోగా పెద్దగా క్రేజ్, స్టార్‌డమ్ లేకపోవడంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ హారర్ మూవీని పెఎవరూ పట్టించుకోలేదు. ఆరు లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది.
ఆ తర్వాత మౌత్ టాక్‌తో వసూళ్లను పెరిగి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అరుళ్‌నిధి యాక్టింగ్‌తో పాటు దర్శకుడు రాసుకున్న కథ, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ పీక్స్‌లో ఉంటుంది. సెకండాఫ్‌లో డిమాంటి కాలనీ కథ మొత్తం ఒకే రూమ్‌లో సాగుతుంది. అయినా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు థ్రిల్లింగ్‌గా నడిపించాడు.
డిమాంటి కాలనీ కథ...
రాఘవ, సాజిద్, విమల్, శ్రీనివాస్ నలుగురు స్నేహితులు. ఓ సినిమా కథ కోసం డిమాంటి కాలనీలో ఉన్న బ్రిటీషర్ల కాలం నాటి బంగళాలోకి వెళతారు. అందులో కనిపించే ఓ విలువైన ఆభరణాన్ని తీసుకొస్తారు. పాడుబడ్డ బంగళా నుంచి తిరిగివచ్చిన తర్వాత నలుగురు స్నేహితుల జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయి? నలుగురు స్నేహితులు ఎలా ప్రాణాలో కోల్పోయారు? ఆ బంగళా చరిత్ర ఏమిటన్నదే ఈ మూవీ కథ.
తొమ్మిదేళ్ల తర్వాత సీక్వెల్...
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత డిమాంటి కాలనీ మూవీకి సీక్వెల్ వచ్చింది. హీరో అరుళ్‌నిధి, డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కాంబినేషన్‌లోనే ఈ సీక్వెల్ తెరకెక్కడం గమనార్హం. ఇటీవలే తమిళంలో ఇండిపెండెన్స్ డే రోజు థియేటర్లలో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సీక్వెల్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లోనే 25 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మిస్టరీయస్ బుక్...
ఓ మిస్టరీయస్ బుక్ చదివిన వారు వరుసగా హత్యలకు గురవుతుంటారు. శ్రీని, రఘు అనే ట్విన్ బ్రదర్స్ కూడా అనుకోకుండా ఆ బుక్ చదువుతారు. ఆ బుక్ వల్లే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి వారు ఏం చేశారు? వారికి హెల్ప్ చేసిన ప్రియా ఎవరు అనే పాయింట్‌తో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సీక్వెల్‌ను తెరకెక్కించాడు. ఈ సీక్వెల్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా అరుణ్ పాండియన్ కీలక పాత్ర చేశాడు. డిమోంటి కాలనీ మూవీకి మూడో పార్ట్ కూడా రాబోతోంది.