Rajamouli David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్.. యాక్టింగ్‌లో ఇరగదీసేశాడు.. ఫన్నీ యాడ్ వైరల్
Rajamouli David Warner: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తే ఎలా ఉంటుంది? మనం ఊహించుకోవాల్సిన అవసరం లేకుండా క్రెడ్ యాప్ ఓ యాడ్ చేసేసింది. ఎలా ఉందో మీరూ చూడండి.
Rajamouli David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు యాక్టింగ్ అంటే పిచ్చి బాగానే ఉందని చాలా రోజులుగానే తెలుసు. సన్ రైజర్స్ జట్టులో ఉన్నప్పుడు తరచూ టాలీవుడ్ యాక్టర్స్ సాంగ్స్ రీల్స్ చేసి నవ్వించేవాడు. అయితే ఇప్పుడు ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లోనే నటించే ఛాన్స్ కొట్టేశాడు. కానీ అతని యాక్టింగ్ చూడటం కాదు ఊహించుకునే భయపడ్డాడు మన రాజమౌళి.

జక్కన్నను భయపెట్టిన వార్నర్
ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. అందులో మన టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించారు. ఇప్పుడీ ఫన్నీ యాడ్ తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి బడా హీరోలు కూడా ఎదురు చూస్తుంటే.. వార్నర్ మాత్రం తన యాక్టింగ్ తో అంతటి దర్శకుడికే దడ పుట్టించాడు.
ఈ యాడ్ ఎలా ఉందో చూద్దాం. మొదట రాజమౌళి క్రికెట్ మ్యాచ్ టికెట్ కౌంటర్ బయట నిల్చొని వార్నర్ కు ఫోన్ చేస్తాడు. "డేవిడ్ గారు.. మీ మ్యాచ్ టికెట్లపై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా?" అని అడుగుతాడు. దానికి వార్నర్ స్పందిస్తూ.. "రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది' అంటాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడుగుతాడు.
అలా అయితే డిస్కౌంట్ కోసం నాకు మీరో ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. అది రాజమౌళి డైరెక్షన్ లో తనకు ఓ ఛాన్స్ ఇవ్వమని. అయితే ఆ ఛాన్స్ ఇచ్చే లోపే ఒకవేళ డేవిడ్ వార్నర్ నిజంగానే తన డైరెక్షన్ లో నటిస్తే ఏమవుతుందో రాజమౌళి ఊహించేసుకుంటాడు. సెట్స్ లో అతని ఓవరాక్షన్, డ్యాన్స్, డైలాగులు.. ఇలా ఒక్కొక్కటీ ఊహించుకొని జడుసుకుంటాడు.
నీకు ఆ ఛాన్స్ ఇచ్చే కంటే క్రెడ్ యూపీఐకి అప్‌గ్రేడ్ అవడమే బెటర్ అని ఫోన్ పెట్టేస్తాడు రాజమౌళి. ఈ ఫన్నీ యాడ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు యాక్టింగ్ లోనూ తాను ఇరగదీయగలనని వార్నర్ ఈ యాడ్ ద్వారా మరోసారి నిరూపించాడు. అటు మన జక్కన్న కూడా తనదైన స్టైల్లో నటించేశాడు.
వార్నర్, రాజమౌళి సూపర్ కాంబినేషన్
ఈ యాడ్ వీడియోను క్రెడ్ తన సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేసింది. ఫేవర్స్ అనేవి మార్కెట్ రిస్క్ ను బట్టి ఉంటాయి అనే ఫన్నీ క్యాప్సన్ తో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. వార్నర్ యాక్టింగ్ కు చాలా మంది ఫిదా అవుతున్నారు. ఈ స్టార్ ఆస్ట్రేలియా క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్నాడు.
గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా 2016లో ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు. తర్వాత ఫ్రాంఛైజీ అతన్ని పక్కన పెట్టడంతో డీసీకి వెళ్లాడు. గతేడాది కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఈ సీజన్లో మాత్రం అతడు అంతగా రాణంచడం లేదు.