Deepika Padukone Baby: తమ పాప తొలి ఫొటోను షేర్ చేసిన దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్.. పేరు కూడా చెప్పేశారు
Deepika Padukone Baby: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ పాప తొలి ఫొటోను షేర్ చేశారు. ఆ పాప ముఖాన్ని రివీల్ చేయకుండా కేవలం ఆమె కాళ్లకు సంబంధించిన ఫొటోను శుక్రవారం (నవంబర్ 1) తమ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ పేరు కూడా చెప్పేశారు.
Deepika Padukone Baby: బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ మొత్తానికి తమ కూతురుకు చెందిన తొలి ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. కానీ ఇప్పుడు కూడా వాళ్లు కేవలం ఆమె కాళ్లు మాత్రమే కనిపించేలా ఓ ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె పేరును దువా పదుకోన్ సింగ్ అని పెట్టినట్లు కూడా వెల్లడించారు.
దీపికా పదుకోన్, రణ్‌వీర్ పాప ఇలా..
దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఒకేసారి తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో తమ పాప ఫొటోను పోస్ట్ చేశారు. "దువా పదుకోన్ సింగ్. దువా అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు దొరికిన సమాధానం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి. దీపికా అండ్ రణ్‌వీర్" అనే క్యాప్షన్ తో ఆమె ఫొటోను పోస్ట్ చేయడం విశేషం.
దీపికా, రణ్‌వీర్ లకు సెప్టెంబర్ 8వ తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆమెకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదా ఫొటోను ఈ జంట రివీల్ చేయలేదు. సాధారణంగా సెలబ్రిటీలు ఎవరూ ప్రైవసీ అంటూ తమ పిల్లల ఫొటోలను కొన్నాళ్ల వరకు పబ్లిగ్గా రివీల్ చేయడం లేదు. ఇప్పుడు దీపికా, రణ్‌వీర్ కూడా ఆ పాపకు సంబంధించిన కాళ్ల ఫొటోను మాత్రమే పంచుకున్నారు.
బాలీవుడ్ లో రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, 83లాంటి హిట్ మూవీస్ లో కలిసి నటించిన దీపిక, రణ్‌వీర్.. కొన్నేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కూడా సంతానం విషయంలో ఆచితూచి వ్యవహరించారు.
చివరికి ఈ ఏడాది మొదట్లో తాము పేరెంట్స్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక సెప్టెంబర్ లో వాళ్లకు పాప పుట్టింది. ఈ జంట శుక్రవారం (నవంబర్ 1) రిలీజైన సింగం అగైన్ మూవీలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ లో నటించారు.