Dayaa Web Series Season 2: దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్ పవన్ సాదినేని-dayaa web series season 2 on the cards reveals director pawan sadineni ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dayaa Web Series Season 2: దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్ పవన్ సాదినేని

Dayaa Web Series Season 2: దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్ పవన్ సాదినేని

Hari Prasad S HT Telugu
Jan 03, 2024 01:59 PM IST

Dayaa Web Series Season 2: జేడీ చక్రవర్తి నటించిన దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తుందని స్పష్టం చేశాడు డైరెక్టర్ పవన్ సాదినేని. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెడతామని తెలిపాడు.

దయా వెబ్ సిరీస్
దయా వెబ్ సిరీస్

Dayaa Web Series Season 2: ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి తొలి వెబ్ సిరీస్ దయా మంచి టాక్ సంపాదించింది. తొలి సీజన్ మంచి సస్పెన్స్ తో ముగియడంతో రెండో సీజన్ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటికి తాజాగా ఈ సిరీస్ డైరెక్టర్ పవన్ సాదినేని సమాధానమిచ్చాడు. దయా రెండో సీజన్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశాడు.

ఓటీటీప్లేతో మాట్లాడిన పవన్ సాదినేని.. దయా వెబ్ సిరీస్ రెండో సీజన్ పై స్పందించాడు. ఈ కొత్త సీజన్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో మొదలువుతుందని కూడా పవన్ తెలిపాడు. ప్రస్తుతం ఓ సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని, రెండో సీజన్ స్క్రిప్ట్ పని ఇంకా మొదలు పెట్టలేదని చెప్పాడు. అతని సినిమా ప్రీప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి.

తన నెక్ట్స్ మూవీలో పవన్.. రానా లేదా దుల్కర్ సల్మాన్ తో పని చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ గా తొలి వెబ్ సిరీస్ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు పవన్ సాదినేని. ఈషా రెబ్బ కూడా ఇందులో నటించింది. తొలి సీజన్ లో ఆమె పాత్ర పెద్దగా కనిపించకపోయినా.. రెండో సీజన్ లో మాత్రం ప్రధాన పాత్ర ఆమెదే అన్నట్లుగా స్పష్టమవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి గతేడాది ఈ వెబ్ సిరీస్ వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సిరీస్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో సత్య అలియాస్ దయా పాత్రలో జేడీ చక్రవర్తి కనిపించాడు. ఫ్లాష్‌బ్యాక్ లో సత్యగా ఉన్న దయా ఎందుకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు? అతని భార్య అలివేలు (ఈషా రెబ్బ) అతని కంటే ఎలా ప్రమాదకరం అన్న విషయాలు రెండో సీజన్ లో తేలనున్నాయి.

ఓ ఫ్రీజర్ వ్యాన్ నడిపే డ్రైవర్ గా సిరీస్ మొదట్లో దయాను చూపిస్తాడు దర్శకుడు. ఈ క్రమంలో అతని వ్యాన్ లోకి వచ్చిన ఓ శవం తర్వాత అతని జీవితాన్ని ఎలా మార్చేసింది అన్నది తొలి సీజన్ లో చూడొచ్చు. దయా, అలివేలులకు ఓ బలమైన గతం ఉన్నట్లుగా మధ్యమధ్యలో చూపించినా దానిపై స్పష్టత రాలేదు.

దయా రెండో సీజన్ పై జేడీ చక్రవర్తి కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. సినిమాలకు చాలా వరకూ దూరమైన జేడీకి.. ఈ వెబ్ సిరీస్ కొత్త ఊపిరిలూదింది. మొదట్లో ఈ షో చేయడానికి అతడు అంగీకరించకపోయినా.. తర్వాత డైరెక్టర్ ఈ స్టోరీ చెప్పిన విధానం నచ్చి ఓకే చెప్పాడు.

Whats_app_banner