Dahan Web Series Review: దహన్ వెబ్ సిరీస్ రివ్యూ - హారర్ సిరీస్ భయపెడుతుందా
Dahan Web Series Review: దహన్ వెబ్‌సిరీస్ ఇటీవల డిస్నీప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజైంది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే...
Dahan Web Series Review: తారే జమీన్ పర్, ఓ మై గాడ్ లాంటి విభిన్న కథాంశాలతో కూడిన సినిమాతో నటిగా బాలీవుడ్‌లో చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నది టిస్కా చోప్రా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ దహన్. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్‌కు విక్రాంత్ పవార్, జైశర్మ దర్శకత్వం వహించారు. ఇటీవల డిస్నీప్లస్ హాట్‌స్టార్ ద్వారా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సిరీస్ రిలీజైంది. తొమ్మిది ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..
శిలాస్ పూర్ కథ...
శిలాస్ పూర్ రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతం. దెయ్యాలకు, అతీంద్రియ శక్తులకు నెలవుగా ఆ ప్రాంతాన్ని భావిస్తుంటారు. ఆ ఊరిలో ఉన్న కొండల్లో విలువైన ఖనిజాలు ఉంటాయి. వాటిని వెలికితీయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ అక్కడి ప్రజలు మాత్రం మైనింగ్ పనులను అడ్డుకుంటారు. మైనింగ్ పనులు సంక్రమంగా జరిగేలా చూసే బాధ్యతను ప్రభుత్వం అవని (టిస్కా శర్మ) అనే కలెక్టర్‌కు అప్పగిస్తుంది.
తన కొడుకు అనయ్‌తో కలిసి ఆ ఊరిలో అడుగుపెడుతుంది అవని. మైనింగ్ జరిగే ప్రాంతంలో రిధియాకన్ అనే మాంత్రికుడు బంధించబడ్డాడని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఆ గనుల్లో అడుగుపెట్టిన వారందరూ వింతవింతగా ప్రవర్తిస్తూ నరరూప రాక్షసులుగా మారిపోతుంటారు.
శిలాస్‌పూర్‌లో స్వరూప్ మహారాజ్ చెప్పిందే వేదం. ఊరి వారందరూ దేవాలయంగా పూజించే శిలాస్థల్‌లో ప్రధాన పూజారిగా అతడు పనిచేస్తుంటాడు. అవని చేసే పనులకు అడ్డుడతాడు స్వరూప్. అవని వల్లే రిధియాకన్ మేల్కొని ప్రజలందరిని రాక్షసులుగా మార్చేస్తున్నాడని ప్రజలందరిని నమ్మిస్తుంటాడు. ద అవని డ్యూటీకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను ఎదురించి అవని ఎలాంటి పోరాటం చేసింది.
ప్రజలందరూ నమ్ముతున్నట్లుగా ఆ కొండల్లో రిధియాకన్ ఉన్నాడా. ఆ గుహల్లో అడుగుపెట్టిన వారు రాక్షసులుగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి ఆ గుహల్లో ఏముంది. తండ్రి చావుకు తల్లి అవని కారణమని అనుక్షణం అవనిని ద్వేషించే అనయ్‌లో ఎలా మార్పువచ్చింది. మైనింగ్ చేపట్టడానికి ఆ ఊరిలో అడుగుపెట్టిన అవని ఆ గనులను మూసేయడానికి ఎలాంటి కష్టాలు పడింది అన్నదే ఈ సిరీస్ కథాంశం.
సైన్స్ కు నమ్మకాలకు మధ్య సంఘర్షణ…(Dahan Web Series Review)
దహన్ తొమ్మిది ఎపిసోడ్స్ తో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్. మూఢనమ్మకాలు, ఆచారాలతో నిండిపోయిన ఓ ప్రాంతంలో మార్పుకోసం ప్రయత్నించే ఓ మహిళ కథకు హారర్, సస్పెన్స్, థ్రిల్‌ను జోడించి దర్శకద్వయం విక్రాంత్ పవార్, జై శర్మ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. సైన్స్, మూడనమ్మకాలకు మధ్య ఉన్న సంఘర్షణను ఈ వెబ్ సిరీస్ లో చర్చించారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు మాయలు, మంత్రాల పేరుతో ప్రజల్ని ఎలా మభ్యపెడుతుంటారు. ఈ అంధవిశ్వాసాల వల్ల జరిగే అనార్థాలను థ్రిల్లింగ్‌చూపించారు
ఫ్యామిలీ డ్రామా…
అవినీతి పరురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిగా టిస్కా శర్మను పరిచయం చేస్తూ సిరీస్ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ తర్వాత శిలాస్‌పూర్‌లో ఆమె అడుగుపెట్టడం, కర్తవ్య నిర్వహణలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో ఫస్ట్ ఎపిసోడ్‌తో సిరీస్ పై ఇంట్రెస్ట్‌ను కలిగించారు. ఆ ఊరి చరిత్రను చూపిస్తూనే ప్రజలు పూజారి స్వరూప్‌ను దేవుడిగా కొలవడం, రిధియాకాన్, రాకాన్ లను గురించి ఆ ఊరి ప్రజల్లో ఉన్న నమ్మకాలు, ప్‌జలు రాకాన్ లుగా మారిపోయి వింతవింతగా ప్రవర్తించడం లాంటి సీన్స్ ఉత్కంఠను పంచుతాయి.
రిధియాకాన్ వెనకున్న గుట్టును విప్పడానికి అవని చేసే ప్రయత్నాలతో కథను ముందుకు నడిపించారు. మరోవైపు అవని కొడుకు అనయ్ క్యారెక్టర్ ద్వారా ఫ్యామిలీ డ్రామాను, లవ్ స్టోరీని చూపించారు దర్శకుడు. చివరలో ఆ ఊరిలో దెయ్యాలు లేవని సైంటిఫిక్ రీజన్ చెప్పి కథను ముగించారు.
లాజిక్స్ మిస్...
దహన్ సిరీస్ కోసం దర్శకద్వయం ఎంచుకున్న కథ బాగుంది. హాలీవుడ్‌లో వచ్చిన జాంబీ సిరీస్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ వాటికి ఇండియన్ నేటివిటీని జోడిస్తూ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. కొన్ని చోట్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ ముందుకు కదలక అక్కడే తిరుగుతూ ఉంటుంది. టిస్కాశర్మ క్యారెక్టర్‌లో లాజిక్ అంతగా అతకలేదు. గుహలో అడుగుపెట్టిన వారందరూ రాక్షసులుగా మారిపోతుంటారు. కానీ ఆమెకు మాత్రం ఏం కాదు. ఇమ్యూనిటీ పవర్ అంటూ లాస్ట్‌లో లాజిక్‌కు వివరణ ఇచ్చారు. కానీ అది సిల్లీగా అనిపిస్తుంది.
టిస్కా శర్మ హైలైట్...
అవని అనే ఐఎఎస్ ఆఫీసర్‌గా టిస్కాశర్మ నటనకు బాగుంది. కర్తవ్యనిర్వహణకు, వ్యక్తిగత జీవితానికి మధ్య నిరంతరం సంఘర్షన ఎదుర్కొనే మహిళగా తన నటనతో ఆకట్టుకున్నది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి నటించింది. ప్రధాన పూజారిగా తన విలనిజంతో ఆదరగొట్టాడు. నెగెటివ్ షేడ్స్ తో మొదలై పాజిటివ్‌గా ముగిసే పోలీస్ ఆఫీసర్‌గా ముఖేష్ తివారి కనిపించాడు. రోహన్ జోషి, లెహర్ ఖాన్ క్యారెక్టర్ ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్‌గా నిలిచాడు.
థ్రిల్ కలిగిస్తుంది...
దహన్ సిరీస్ భయపెడుతూనే చక్కటి థ్రిల్‌ను పంచుతుంది. కథ, యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. కొంచెం ఓపికగా చూస్తే మాత్రం డిసపాయింట్ చేయదు.