Dada Movie Review: దాదా మూవీ రివ్యూ - త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఎలా ఉందంటే-dada movie telugu review kavin aparna das movie streaming on amazon prime ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dada Movie Telugu Review Kavin Aparna Das Movie Streaming On Amazon Prime Ott Review

Dada Movie Review: దాదా మూవీ రివ్యూ - త‌మిళ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 15, 2023 07:23 AM IST

Dada Movie Review: కెవిన్‌, అప‌ర్ణాదాస్‌ జంట‌గా గ‌ణేష్ కే బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ సినిమా దాదా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.

కెవిన్‌
కెవిన్‌

Dada Movie Review: ఈ ఏడాది త‌మిళంలో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యాన్ని సాధించిన సినిమా దాదా. కెవిన్‌( Kavin), అప‌ర్ణాదాస్‌ (Aparna das) హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాతో గ‌ణేష్ కే బాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. 3 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో 20 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...

మ‌ణికంద‌న్ క‌థ‌...

మ‌ణికంద‌న్ (కెవిన్ ) , సింధు( అప‌ర్ణాదాస్‌) ఒకే కాలేజీలో చ‌దువుతుంటారు. చాలా కాలంగా ప్రేమ‌లో ఉంటారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా సింధుకు ప్రెగ్నెన్సీ వ‌స్తుంది. అబార్ష‌న్ చేయించుకోమ‌ని మ‌ణికంద‌న్ స‌ల‌హా ఇస్తాడు. కానీ సింధు అందుకు ఒప్పుకోదు. దాంతో పెళ్లి కాకుండానే సింధు తో పాటు ఆమెకు పుట్ట‌బోయే బాధ్య‌త మ‌ణికంద‌న్‌పై ప‌డుతుంది.

సింధు ప్రెగ్నెంట్‌గా ఉన్నా ఆమె యోగ‌క్షేమాల గురించి ఏ మాత్రం ప‌ట్టించుకోడు మ‌ణికంద‌న్‌. అత‌డి నిర్ల‌క్ష్యం కార‌ణంగా సింధు ప్రాణాలు పోయే ప‌రిస్థితి వ‌స్తుంది. దాంతో పుట్టిన పిల్లాడిని మ‌ణికంద‌న్‌కు వ‌దిలిపెట్టి అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది సింధు. తొలుత త‌న‌కు పుట్టిన బిడ్డ‌ను అనాథశ్ర‌మంలో చేర్పించాల‌ని మ‌ణికంద‌న్ అనుకుంటాడు. పేగుబంధం అడ్డురావ‌డంతో ఆ బాబు బాధ్య‌త‌ను తానే తీసుకుంటాడు.

ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? మ‌ణికంద‌న్‌ను దూరంగా వెళ్లిపోయిన సింధు త‌న త‌ప్పును ఎలా తెలుసుకుంది? అనుకోకుండా సింధు ప‌నిచేస్తోన్న కంపెనీలోనే మ‌ణికంద‌న్ ఉద్యోగంలో చేరాల్సిన‌ అవ‌స‌రం ఎందుకొచ్చింద‌న్న‌దే(Dada Movie Review)ఈ సినిమా క‌థ‌.

తండ్రి బాధ్య‌త‌ల్ని...

చ‌దువుకూడా పూర్తికాని ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేని సాధార‌ణ యువ‌కుడు అనుకోకుండా తండ్రి గామారితే అత‌డి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే పాయింట్‌తో దాదా సినిమా (Dada Movie Review)రూపొందింది.

తండ్రిగా మారిన త‌ర్వాత చిన్నారుల‌ బాధ్య‌త‌ల్ని స్వీక‌రించే క్ర‌మంలో నేటి యువ‌త‌ ప‌డే సంఘ‌ర్ష‌ణ‌ను ఆలోచ‌నాత్మ‌కంగా అందరికి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో చూపించారు. పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లితో పాటు తండ్రి బాధ్య‌త సందేశాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు గ‌ణేష్ బాబు ఈ సినిమాలో చర్చించారు. తండ్రి ఔన్య‌త్యాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించిన సినిమా ఇది.

బ్యాలెన్సింగ్ బాగుంది...

ఇందులో హీరోహీరోయిన్ల‌ను ఒక‌రిని ఎక్కువ మ‌రొక‌రి త‌క్కువ అన్న‌ట్లుగా కాకుండా ఇద్ద‌రి పాత్ర‌ల‌ను బ్యాలెన్స్ చేస్తూ క‌థ‌ను రాసుకున్న తీరు బాగుంది. సినిమా ఫ‌స్ట్ హాఫ్‌లో మ‌ణికంద‌న్ విల‌న్‌గా అనిపిస్తే సెకండాఫ్ సింధు పాత్ర అలా క‌నిపిస్తుంది. ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల వారు అలా మార‌డాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఛాయ‌ల జోలికి పోకుండా స‌హ‌జంగా సీన్స్‌ను రాసుకోవ‌డం బాగుంది.

చ‌దువు పూర్తిచేసుకొని డిగ్రీ ప‌ట్టాతో ఇంటి ముందు నిల‌బ‌డాల్సిన త‌న కొడుకు తండ్రిగా మారి చేతులో చిన్నారితో క‌నిపించ‌డంతో హీరో ఫాద‌ర్ ప్ర‌వ‌ర్తించే తీరు...త‌న‌కు ఏడుప‌న్న‌దే రాద‌ని చెప్పిన హీరో పుట్టిన బిడ్డ‌ను అనాథ‌శ్ర‌మంలో వ‌దిలిపెట్టిన త‌ర్వాత క‌న్నీళ్లు పెట్టుకునే సీన్స్‌.. ఇలా చాలా సీన్స్ ఎమోష‌న్స్ పండించే విష‌యంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను చాటిచెప్పాయి.

క‌థ వేగం త‌గ్గింది....

సింధు ప‌నిచేస్తోన్న ఆఫీస్‌లోనే అనుకోని ప‌రిస్థితుల్లో మ‌ణికంద‌న్ ఉద్యోగంలో చేరాల్సిరావ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ త‌ర్వాత క‌థ వేగం కొంత త‌గ్గింది. ఆఫీస్ ఎపిసోడ్స్‌లో అన్ని ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో సాగుతాయి. సింధు త‌న త‌ప్పును తెలుసుకునే సీన్స్‌ను మ‌రింత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.

బాధ్య‌తాయుత‌మైన తండ్రిగా...

బ‌రువు బాధ్య‌త‌లు లేని వ్య‌క్తి నుంచి రెస్పాన్స్‌బుల్ ఫాద‌ర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే పాత్ర‌లో కెవిన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. అత‌డి క్యారెక్ట‌ర్‌లో ఎక్క‌డ అతి క‌నిపించ‌దు. సింధుగా అప‌ర్ణ‌దాస్ యాక్టింగ్ కూడా సినిమాను నిల‌బెట్టింది. భాగ్య‌రాజ్‌, ఐశ్వ‌ర్య‌, వీటీవీ గ‌ణేష్‌, మోనికా త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

Dada Movie Review - కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌

దాదా కంప్లీంట్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. సెన్సిటివ్ ఇష్యూను తీసుకొని మ‌న‌సులు క‌దిలించేలా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అయితే త‌మిళ్ వెర్ష‌న్ మాత్ర‌మే అందుబాటులో ఉంది.

IPL_Entry_Point