Daaku Maharaaj Tickets: మాకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదు: డాకు మహారాజ్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Daaku Maharaaj Tickets: డాకు మహారాజ్ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదని అతడు అనడం విశేషం. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Daaku Maharaaj Tickets: ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఒకటిగా వస్తోంది బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్. ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఏపీలో ఇప్పటికే అనుమతి ఇచ్చారు. అయితే తెలంగాణలో మాత్రం ఇక నుంచి ఆ అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమకు టికెట్ల రేట్ల పెంపు అవసరం లేదని అతడు అన్నాడు.
డాకు మహారాజ్ టికెట్ల ధర
బాబీ కొల్లి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో మంగళవారం (జనవరి 7) అతడు మీడియాతో మాట్లాడాడు. "మాకు ఇప్పటికే ఏపీలో టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి వచ్చింది.
తెలంగాణలో పెంపు కోసం అడగటం లేదు. నైజాం ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న టికెట్ల ధరలపై నేను సంతోషంగానే ఉన్నాను. టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరలేదు. ఇప్పుడున్న ధరలతోనే రిలీజ్ చేస్తున్నాం. అందులో ఎలాంటి సమస్యలు లేవు" అని నాగ వంశీ స్పష్టం చేశాడు. ఏపీలో మాత్రం ఇప్పటికే డాకు మహారాజ్ మూవీ టికెట్ల ధరల పెంపుకు అనుమతి లభించింది. సింగిల్ స్క్రీన్ అయితే రూ.110, మల్టీప్లెక్స్ అయితే రూ.135 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.
డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్
డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ లాంటి వాళ్లు నటించారు. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఓటీటీప్లేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. మూవీ కనీసం రూ.85 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ఈవెన్ సాధిస్తుంది. నైజాం ఏరియాలో ఈ మూవీ రూ.18 కోట్ల బిజినెస్ చేసింది.
ఇక ఈస్ట్ గోదావరిలో రూ.6.3 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణలో రూ.5.6 కోట్లు, గుంటూరులో రూ.9.2 కోట్లు, సీడెడ్ లో రూ.16.2 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.4 కోట్లు, నెల్లూరులో రూ.2.8 కోట్లు, కర్ణాటకలో రూ.4 కోట్లు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.1.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.84 కోట్లుగా ఉంది. ఏపీలో మొత్తంగా డాకు మహారాజ్ థియేట్రికల్ హక్కుల విలువ రూ.51 కోట్లుగా ఉండటం విశేషం.
ఇప్పటి వరకూ వచ్చిన బాలయ్య మూవీస్ లో ఇదే అత్యధికం అంటే ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల కిందట చిరంజీవితో వాల్తేర్ వీరయ్య మూవీ తీసి సంక్రాంతి హిట్ కొట్టిన బాబీ కొల్లి.. ఈసారి బాలయ్యతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.