D50 Title: హీరో, దర్శకత్వం ధనుష్.. మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఓ తెలుగు హీరో కూడా..
Dhanush D50 Title, First Look: ధనుష్ హీరోగా నటిస్తూ ఓ చిత్రానికి స్వయంగా డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఆ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ నేడు రివీల్ అయింది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
D50 Updates: తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఆయన హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా గత నెలలోనే రిలీజ్ అయింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం మోస్తరు హిట్ కావటంతో పాటు ప్రశంసలను దక్కించుకుంది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతోనూ ప్రస్తుతం ఓ సినిమా (DNS) చేస్తున్నారు ధనుష్. అలాగే, తన స్వీయ దర్శకత్వంలోనూ మరో చిత్రం (D50) చేస్తున్నారు. ధనుష్ డైరెక్షన్ చేస్తూ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‍ను నేడు (ఫిబ్రవరి 19) రిలీజ్ చేసింది మూవీ టీమ్.
టైటిల్ ఇదే..
D50 సినిమాకు ‘రాయన్’ (Raayan) అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రం కూడా యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. రాయన్ ఫస్ట్ లుక్‍లో ధనుష్ ఇంటెన్స్‌గా కనిపించారు. ఫుడ్ ట్రక్ ముందు ఆఫ్రాన్ ధరించి.. చేతిలో చేతిలో పదునైన వస్తువును పట్టుకున్నారు ధనుష్. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం ఫుడ్ ట్రక్‍పై ఉన్నారు. ఆ ఇద్దరి చేతిలోనూ ఆయుధాలు ఉన్నాయి.
సందీప్ కిషన్ మరోసారి..
రాయన్ చిత్రంలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధనుష్ వెనుక జీపు లాంటి వాహనంలో సందీప్ కూడా ఉన్నారు. కెప్టెన్ మిల్లర్‌లో ధనుష్‍తో కలిసిన నటించిన సందీప్.. మరోసారి ఆయనతో రాయన్‍లో చేస్తున్నారు.
రాయన్ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ కూడా ధనుష్‍దే. ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఎస్‍జే సూర్య, కాళిదాస్ జయరాం, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, అనిఖా సురేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.
రాయన్ మూవీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా.. ప్రసన్న జీకే ఎడిటింగ్ చేస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడు?
రాయన్ సినిమా షూటింగ్ గతేడాది జూలైలో మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవికి ఈ చిత్రం రిలీజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, రిలీజ్ గురించి ఫస్ట్ లుక్‍లో వెల్లడించలేదు మూవీ టీమ్.
రాయన్ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ వస్తుందని మూవీ టీమ్ కన్ఫార్మ్ చేసింది. మూడు భాషలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ట్వీట్ చేసింది.
ధనుష్ ఇతర సినిమాలు..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాది విడుదల చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.