Summer Releases in Tollywood: సమ్మర్ ఫస్ట్‌హాఫ్ అదిరింది - సెకండాఫ్‌లో ఆ జోరు కొనసాగేనా?
Summer Releases In Tollywood: 2023లో సమ్మర్ ఫస్ట్ హాఫ్ అదిరింది. దసరా, బలగంతోపాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపించాయి. సెకండాఫ్‌లో ఆ జోరు కొనసాగించేందుకు యంగ్ హీరోలు సిద్ధమవుతోన్నారు. ఆ హీరోలు ఎవరంటే..

Summer Releases In Tollywood: సినీ పరిశ్రమకు బెస్ట్ సీజన్‌లలో వేసవి ఒకటి. మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే వేసవిలో థియేటర్లలో టికెట్లు ఎక్కువగానే తెగుతుంటాయి. అందుకే వేసవిలో తమ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాల్ని పంచేందుకు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు రెడీగా ఉంటారు. ఈ వేసవి టాలీవుడ్‌కు బాగా కలిసివచ్చింది. సమ్మర్ బరిలో నిలిచిన పలు చిన్న సినిమాలు అంచనాలకు మించి విజయాల్ని అందుకున్నాయి.
వేసవి కానుకగా మార్చి 30న రిలీజైన దసరా సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దసరాతో పాటు సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకొచ్చిన చిన్న సినిమా బలగం అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. అలాగే విశ్వక్‌సేన్ దాస్ కా ధమ్కీ లాభసాటి మూవీగా నిలిచింది. సమ్మర్ ఫస్ట్ హాఫ్ జోరును సెకండాఫ్‌లో కంటిన్యూ చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి.
అఖిల్ కు పోటీ ఉంటుందా?
ఏప్రిల్ 21న (నేడు) విరూపాక్ష సినిమాతో సాయిధరమ్‌తేజ్ (Saidharam tej) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించాడు.
విరూపాక్షపై పై పాజిటివ్ బజ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు సమాచారం. అలాగే డిజిటల్, శాటిలైట్ డీల్ కూడా రిలీజ్‌కు ముందే క్లోజ్ అయినట్లు తెలిసింది. లాంగ్ గ్యాప్ తర్వాత సాయిధరమ్‌తేజ్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అన్నది శుక్రవారం నాటి కలెక్షన్స్‌తో క్లారిటీ రానుంది.
అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటించిన ఏజెంట్ ఈ నెల 28న రిలీజ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గారూపొందిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. అఖిల్ మార్కెట్‌కు మించి దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
రెండేళ్ల శ్రమ, మార్కెట్‌కు మించి బడ్జెట్‌కు అఖిల్ ఏ మేరకు న్యాయం చేస్తాడన్నది మరో వారం రోజుల్లో తేలనుంది. ఈ సినిమాకు పోటీగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సీక్వెల్ రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో పెద్దగా ఆడకపోవడంతో ఈ సీక్వెల్‌పై టాలీవుడ్‌లో జీరో బజ్ నెలకొంది. దాంతో అఖిల్ పెద్దగా పోటీ ఉండకపోవచ్చునని అంటోన్నారు.
ఉగ్రం వర్సెస్ రామబాణం
మే 5న అల్లరి నరేష్ (Allari Naresh)ఉగ్రంతో పాటు గోపీచంద్ రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడబోతున్నాయి. నాంది సక్సెస్ తర్వాత అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో ఉగ్రం సినిమా రూపొందుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రనటిస్తోన్న సినిమా ఇది.
మరోవైపు లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలయికలో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ రామబాణం తో మే 5న గోపీచంద్ తన లక్‌ను పరీక్షించుకోబోతున్నాడు. అల్లరి నరేష్‌తో పాటు గోపీచంద్‌కు సక్సెస్ కీలకంగా మారింది. హిట్ట్ కాంబోలు వారిని గట్టెక్కిస్తాయే లేదో చూడాల్సిందేనని టాలీవుడ్ వర్గాలు చెబుతోన్నాయి.
కస్టడీ తో చైతూ కోలీవుడ్ ఎంట్రీ...
కస్టడీ సినిమాతో నాగచైతన్య (Nagachaitanya) కోలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతున్నాడు. పోలీస్ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ ద్విభాషా సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తోన్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌తో సక్సెస్‌ఫుల్‌గా హీరోగా కొనసాగుతోన్న నాగచైతన్య ఈ సినిమాతో కోలీవుడ్‌లో పాగా వేస్తాడో లేదో అన్నది మరో ఇరవైరోజుల్లో తేలనుంది.
అన్నీ మంచి శకునములే
సక్సెస్ ఫెయిల్యూర్స్‌కు అతీతంగా తెలుగులో వరుస అవకాశాల్ని సొంతం చేసుకుంటోన్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. అతడు హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అన్నీ మంచి శకునములే సినిమా మే 18న రిలీజ్ కాబోతున్నది. ఓ బేబీ తర్వాత నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాతోనైనా సంతోష్ శోభన్‌కు హిట్ దక్కుతుందో లేదో చూడాల్సిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆదిపురుష్‌తో సమ్మర్ ఎండ్
ప్రస్తుతం తెలంగాణ నేపథ్య సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న మరో మూవీ మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది. వేసవికి ఆదిపురుష్ (Aadipurush) సినిమాతో ప్రభాస్ వీడ్కోలు పలకబోతున్నాడు. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా క్రేజ్ నెలకొంది. అయితే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దాంతో మరోసారి వీఎఫ్ ఎక్స్‌లో మార్పులు చేస్తూ జూన్ 16న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలతో పరాజయాల్ని అందుకున్న ప్రభాస్‌ను ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడో లేదోఅని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు.