Custody Teaser: నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం.. నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేసింది
Custody Teaser: నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం అంటూ నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేసింది. చైతూ ఎంతో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న ఈ మూవీ మే12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Custody Teaser: లవర్ బాయ్ నాగచైతన్యను ఓ కొత్త లుక్ లో చూపెడుతోంది కస్టడీ మూవీ. చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ గురువారం (మార్చి 16) రిలీజైంది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ కస్టడీ మూవీలో చైతన్య సరసన కృతిశెట్టి నటిస్తోంది. రెండు రోజుల కిందట టీజర్ టీజ్ అంటూ ఓ షార్ట్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు టీజర్ తీసుకొచ్చారు.
అభిమానులు ఊహించినట్లే ఈ కస్టడీ టీజర్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాగే టీజర్ కూడా మూవీపై అంచనాలను పెంచేస్తోంది. 88 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో చైతన్య చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.
"గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి.. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎప్పుడు వస్తుంది. ఎటు నుంచి వస్తుంది. ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలనీ లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం" అంటూ నాగ చైతన్య వాయిస్ తో టీజర్ సాగుతుంది.
కస్టడీ మూవీపై ఆసక్తి పెంచేలా టీజర్ కట్ చేశారు. నాగ చైతన్య చేయబోతున్న ఆ యుద్ధం ఏంటి? ఎవరిపై? అనేది తెలుసుకోవాలన్న కోరిక అభిమానుల్లో కలుగుతుంది. ఈ టీజర్ లో మిగతా అంశాల జోలికి వెళ్లకుండా చాలా వరకూ యాక్షన్ సీన్స్ కే పరిమితం చేశారు.
విలన్ అరవింద్ స్వామి, శరత్ కుమార్ ల క్యారెక్టర్లను కూడా ఇందులో పరిచయం చేశారు. "నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. ఎస్.. దట్ ట్రూట్ ఈజ్ ఇన్ మై కస్టడీ" అనే మరో పవర్ ఫుల్ డైలాగుతో టీజర్ ముగుస్తుంది.
తెలుగుతోపాటు తమిళంలోనూ వస్తున్న ఈ కస్టడీ మూవీ మే 12న రిలీజ్ కానుంది. ఈ టీజర్ అక్కినేని అభిమానులకు గూస్‌బంప్స్ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా థ్యాంక్యూలాంటి ఓ డిజాస్టర్ తర్వాత చైతూ కూడా ఈ కస్టడీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, అతని తనయుడు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. ఈ ఇద్దరు తండ్రీకొడుకుల పనితనం ఎంతటిదో టీజర్ చూస్తూనే స్పష్టమవుతోంది. స్క్రీన్ పై కనిపించే సీన్స్ కు తగినట్లు బ్యాక్‌గ్రౌండ్ లో మ్యూజిక్ అదిరిపోయింది.