Crime Thriller Web Series: నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మరో రెండు రోజుల్లోనే వస్తోంది
Crime Thriller Web Series: నాలుగేళ్లుగా ఓటీటీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లోనే వచ్చేస్తోంది. మరి ఈ థ్రిల్లింగ్ మూడో సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?
Crime Thriller Web Series: ఓటీటీ ప్రేక్షకులు ఓ సూపర్ డూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ సిరీస్ కొత్త సీజన్ తో వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే ఈ సిరీస్ రానుండగా.. మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ మరేదో కాదు.. మీర్జాపూరే. ఈ సిరీస్ మూడో సీజన్ శుక్రవారం (జులై 5) రానుంది.
మీర్జాపూర్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ డేట్
ఇప్పటి వరకూ ఓటీటీల్లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మీర్జాపూర్. 2018లో ఈ సిరీస్ తొలి సీజన్ వచ్చింది. అప్పట్లో పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చినా.. తర్వాత ఓ రేంజ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రెండో సీజన్ మరో రెండేళ్లకు అంటే 2020లో వచ్చింది. ఆ సీజన్ ను ఎంతో ఉత్కంఠగా ముగించడంతో నాలుగేళ్లుగా ఈ మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి ఆ కొత్త సీజన్ కు టైమ్ దగ్గర పడింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మీర్జాపూర్ సీజన్ 3ని వచ్చే శుక్రవారం (జులై 5) నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను చాలా రోజులుగా టీజ్ చేస్తూ గత నెలలోనే రివీల్ చేశారు. ఆ తర్వాత జూన్ 20వ తేదీన ట్రైలర్ కూడా వచ్చేసింది. ప్రేక్షుకుల నిరీక్షణకు తగినట్లే ఈ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది.
మీర్జాపూర్ ప్రమోషన్లు
మీర్జాపూర్ తొలి రెండు సీజన్లు హిట్ అవడంతో మూడో సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ కొత్త సీజన్ ను మేకర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రైమ్ వీడియో తన సోషల్ మీడియాలో ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలను పోస్ట చేస్తూనే ఉంది. ఈ కొత్త సీజన్లో మీర్జాపూర్ సింహాసనం ఎవరి సొంతమవుతుందో అన్న ఆసక్తి నెలకొంది.
మొదటి సీజన్లో మీర్జాపూర్ కేంద్రంగా కాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠీ), అతని కొడుకు మున్నా భయ్యా (దివ్యేందు శర్మ) చేసే అరాచకాలు, వారి దగ్గర పని చేయడానికి వచ్చి వాళ్లకే ఎదురు తిరిగిన ఇద్దరు అన్నదమ్ముల కథను చూపించారు. తొలి సీజన్ చివర్లో ఆ ఇద్దరిలో పెద్ద వాడు కన్ను మూస్తాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా (అలీ ఫజల్) రివేంజ్ తీర్చుకుంటాడు. ఆ దాడిలో నుంచి తీవ్రంగా గాయపడి తర్వాత కోలుకున్న అతడు.. మీర్జాపూర్ గద్దెపై ఎలా కూర్చుంటాడన్నది చూపించారు.
అయితే ఆ సీజన్ చివర్లో కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను చంపేస్తాడు. కానీ కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని వెళ్లినట్లు చూపించారు. తాను కోల్పోయిన మీర్జాపూర్ సింహాసనాన్ని తిరిగి పొందడానికి ఈ కొత్త సీజన్లో కాలీన్ మళ్లీ రానున్నాడు. అతనితోపాటు గుడ్డూ భయ్యాకు మరికొందరి నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. మరి ఈ సీజన్లో అతడు తన సింహాసనాన్ని ఎలా కాపాడుకుంటాడన్నది చూడాలి.