Crime Thriller Web Series: ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బోనస్ ఎపిసోడ్ వచ్చేస్తోంది.. అస్సలు మిస్ కావద్దు
Crime Thriller Web Series: ఓటీటీలో ఉన్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3లో ఓ బోనస్ ఎపిసోడ్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో గురువారం (ఆగస్ట్ 29) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది.
Crime Thriller Web Series: ఓటీటీల్లోని బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుందీ సిరీస్. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి ప్రేక్షకుల కోసం ఓ బోనస్ ఎపిసోడ్ రాబోతోంది. మూడో సీజన్లో ప్రేక్షకులు చాలా మిస్ అయిన పాత్రతో ఈ ఎపిసోడ్ రాబోతుండటంతో దీనిని అస్సలు మిస్ కావద్దంటూ ప్రైమ్ వీడియో చెబుతోంది.
మీర్జాపూర్ సీజన్ 3 బోనస్ ఎపిసోడ్
మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3 గత నెలలోనే ప్రైమ్ వీడియోలోకి వచ్చిన విషయం తెలుసు కదా. నాలుగేళ్ల పాటు ఎంతో ఓపిగ్గా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ మూడో సీజన్ చాలా నెమ్మదిగా సాగడంతోపాటు తొలి రెండు సీజన్లలో తన నటనతో అలరించిన మున్నా త్రిపాఠీ (దివ్యేందు శర్మ) పాత్ర లేకపోవడం కూడా నిరాశ పరిచింది.
అయితే అలాంటి అభిమానుల కోసమే ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓ బోనస్ ఎపిసోడ్ తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ను గురువారం (ఆగస్ట్ 29) ఓ స్పెషల్ వీడియో ద్వారా చేసింది. ఈ బోనస్ ఎపిసోడ్ శుక్రవారం (ఆగస్ట్ 30) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మున్నా వచ్చేస్తున్నాడు..
ఈ బోనస్ ఎపిసోడ్ ప్రత్యేకంగా మున్నా త్రిపాఠీ అభిమానుల కోసమే కావడం విశేషం. అందుకే అతని పాత్రతోనే ఈ ఎపిసోడ్ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. "రచ్చ జరగబోతోంది. ఎందుకంటే బోనస్ ఎపిసోడ్ రాబోతోంది. మీర్జాపూర్ బోనస్ ఎపిసోడ్ ఆగస్ట్ 30న" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో తన ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేసింది.
అందులో అతడు మాట్లాడుతూ.. "నేను లేకపోయేసరికి బాగా రచ్చ జరిగింది. నా ఫ్యాన్స్ నన్ను బాగా మిస్ అయ్యారని నేను విన్నాను. సీజన్ 3లో మీరు కొన్ని విషయాలను మిస్ అయ్యారు. వాటిని నేను వెలికి తీసి మీ కోసం తీసుకొస్తున్నాను. మున్నా త్రిపాఠీ సౌజన్యంతో.. ఎందుకంటే నేను ముందు చేసేస్తాను.. తర్వాతే ఆలోచిస్తాను.." అని మున్నా పాత్రధారి దివ్యేందు శర్మ అన్నాడు.
మీర్జాపూర్ వెబ్ సిరీస్
2018లో ప్రైమ్ వీడియోలో వచ్చిన మీర్జాపూర్ సీజన్ 1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు వచ్చిన రెండో సీజన్ మరింత రక్తి కట్టించింది. ఈ సిరీస్ లో విలన్ పాత్రలు పోషించిన వాళ్లలో కాలీన్ భయ్యా అసలు వ్యక్తిగా.. ఈ మున్నా భయ్యా రెండో పాత్ర.
రెండో సీజన్ చివర్లోనే ఈ మున్నా పాత్ర చనిపోయినట్లుగా చూపించడంతో మూడో సీజన్ అతని అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనిపై చాలా మంది పెదవి విరిచారు. అలాంటి అభిమానులను అలరించడానికే ప్రైమ్ వీడియో ఇప్పుడీ బోనస్ ఎపిసోడ్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ ద్వారా మేకర్స్ ఏం చూపించబోతున్నారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.