Crime Thriller Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. మూడు రోజుల్లోనే ఆ రికార్డు
Crime Thriller Movie: ఓటీటీలో ప్రస్తుతం ఓ క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ మూవీ హల్చల్ చేస్తోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే 10 కోట్ల వాచ్ మినట్స్ తో దూసుకెళ్తోంది.
Crime Thriller Movie: క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఓటీటీల్లో ఎంత డిమాండ్ ఉంటుందో తాజాగా మరో సినిమా కూడా నిరూపిస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన రౌతు కా రాజ్ అనే మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఓ మర్డర్ చుట్టూ తిరిగే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
రౌతు కా రాజ్ రికార్డు
నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన రౌతు కా రాజ్ మూవీ గత శుక్రవారం (జూన్ 28) జీ5 ఓటీటీలోకి వచ్చింది. మంచు కొండల్లో ఉన్న ఓ చిన్న ఊరు, అందులో అనుమానాస్పదంగా ఓ మహిళ చనిపోవడం, తర్వాత అది హత్యగా తేలడం, అది ఎవరు చేశారన్న ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ రౌతు కా రాజ్ మూవీ తిరుగుతుంది. రౌతు అంటే ఆ ఊరి పేరు. రాజ్ అంటే రహస్యం.
ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల వాచ్ మినట్స్ సొంతం చేసుకున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. "పది కోట్ల వాచ్ మినట్సే చెబుతున్నాయి.. ఈ రహస్యానికి తిరుగులేదని. రౌతు కా రాజ్ మీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని తెలిపింది. నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ఇది.
ట్విస్టులు ఊహించలేరు
ఈ సినిమా సక్సెస్ పై నవాజుద్దీన్ స్పందించాడు. "రౌతు కా రాజ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ జానర్‌లో ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రజల యాస భాషలు, వారు ప్రవర్తను రియలిస్టిక్‌గా ఈ సినిమాలో చూపించాం. థ్రిల్లర్ సినిమానే అయినా అంతర్లీనంగా వచ్చే కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఓ మర్డర్ చూట్టూ ఈ మూవీ సాగుతుంది. ఆ హత్య ఎవరు చేశారన్నది చివరి వరకు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో అందరినీ మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ చక్కటి ఆదరణను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది" అని అన్నాడు.
ఆ హత్య చుట్టూ తిరుగుతూ..
పదిహేనేళ్లుగా ఎలాంటి క్రైమ్‌లు జరగని రౌతు కీ బేలి ఊళ్లో ఓ మర్డర్ జరుగుతుంది. అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారుతుంది. ఆ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ), ఇన్‌స్పెక్టర్ దిమ్రి (రాజేష్ కుమార్) కలిసి ఈ కేసును ఎలా ఛేదించారు?
వార్డెన్‌ను ఎవరు హత్య చేశారు? అసలైన దోషులను పట్టుకునే క్రమంలో దీపక్, దిమ్రిలకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ. మర్డర్ మిస్టరీ కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ సూరాపూర్ ఈ మూవీని తెరకెక్కించాడు. జీ5 ఓటీటీలో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. జీ5 ఓటీటీ ఏడాదికి రూ.899, రూ.1199 ప్లాన్స్ తో అందుబాటులో ఉంది. ఆరు నెలలకు కావాలంటే రూ.699 ప్లాన్ కూడా ఉంది.