Blue Star OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రికెట్ థ్రిల్లర్ మూవీ .. మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?-cricket based tamil political thriller blue star ott streaming on amazon prime from february 29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Cricket Based Tamil Political Thriller Blue Star Ott Streaming On Amazon Prime From February 29

Blue Star OTT: ఓటీటీలోకి వచ్చేసిన క్రికెట్ థ్రిల్లర్ మూవీ .. మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 29, 2024 12:33 PM IST

Blue Star OTT Streaming Date: తమిళ స్టార్ యాక్టర్ అశోక్ సెల్వన్ నటించిన రీసెంట్ పొలిటికల్ క్రికెట్ డ్రామా మూవీ బ్లూ స్టార్. తమిళనాడు థియేటర్లలో విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న బ్లూ స్టార్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేసిన క్రికెట్ పొలిటికల్ థ్రిల్లర్.. మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రికెట్ పొలిటికల్ థ్రిల్లర్.. మూడింట్లో స్ట్రీమింగ్.. ఎక్కడెక్కడంటే?

Blue Star OTT Release: ఈ మధ్య కాలంలో చాలా మంది దర్శక నిర్మాతలు సంచలన క్రీడల చుట్టూ బయోపిక్‌లు, డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆటగాళ్ల నిజమైన పోరాటాలను చూడటానికి తమ అపారమైన మద్దతు, ఆసక్తిని చూపించిస్తుంటారు. ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే తమిళ పాపులర్ హీరో అశోక్ సెల్వన్ నటించిన బ్లూ స్టార్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ డ్రామా. క్రికెట్ నేపథ్యం చుట్టూ జరిగే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు.

బ్లూ స్టార్ మూవీలో క్రికెట్ పోటీతో పాటు అందులోని ప్రధాన ఆటగాళ్లు తమ స్నేహితులకు ఎలా శత్రువులు అవుతారో చూపించడం చాలా ఆసక్తిగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నీలం ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. జయకుమార్ దర్శకత్వంలో నిర్మించిన తమిళ భాషా క్రికెట్ చిత్రమే బ్లూ స్టార్. అశోక్ సెల్వన్, శంతను భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కీర్తి పాండియన్, దివ్య దురైసామి, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

బ్లూ స్టార్ మూవీ మొదటిసారి జనవరి 25, 2024న థియేట్రికల్‌గా విడుదలైంది. రిలీజైన తొలి రోజు నుంచి ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన బ్లూ స్టార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా బ్లూ స్టార్ సినిమాకు ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ 7.7 రేటింగ్ ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్లూ స్టార్ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో. వేర్వేరు కులాలు, వర్గాలకు చెందిన ఇద్దరు క్రికెట్ ప్రత్యర్థుల చుట్టూ బ్లూ స్టార్ తిరుగుతుంది.

దళిత క్రిస్టియన్ రంజిత్ పాత్రలో అశోక్ సెల్వన్, హిందూ ఆటగాడు రాజేష్ పాత్రలో శంతను నటించారు. స్పోర్ట్స్ ఆధారిత చిత్రాలను చూడటానికి ఇష్టపడే వారికి బ్లూ స్టార్ సినిమా ఒక మంచి ఛాయిస్. ఎందుకంటే ఇది సినిమా చివరి వరకు థ్రిల్లింగ్ సీన్లతో కట్టిపడేస్తుంది. అలాంటి బ్లూ స్టార్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో బ్లూ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అది కేవలం తమిళ భాషలో మాత్రమే బ్లూ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

బ్లూ స్టార్ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తమిళంలో విడుదల చేశారు. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రమే కాకుండా మరో రెండు ఓటీటీల్లో బ్లూ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టెంట్‌కొట్టా (Tentkotta OTT), సింప్లీ సౌత్ (Simply South OTT) అని తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం తెలియని మరో రెండు ఓటీటీ వేదికల్లో బ్లూ స్టార్ రిలీజైంది. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూసేందుకు బ్లూ స్టార్ అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

కాగా బ్లూ స్టార్ మూవీలో హీరో హీరోయిన్లుగా చేసిన అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ గతేడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. దాంతో అశోక్ సెల్వన్, కీర్తి ఇద్దరూ భార్యాభర్తలుగా మారిన తర్వాత కలిసి నటించిన తొలి సినిమాగా బ్లూ స్టార్ నిలిచింది. అంతేకాకుండా సినిమా భారీ విజయం అందుకోవడంతో భార్యాభర్తలుగా కలిసి తొలి హిట్ అందుకున్నారు.

WhatsApp channel