Committee Kurrollu Teaser: నిహారిక మూవీ కమిటీ కుర్రోళ్ళు టీజర్ రిలీజ్.. బాల్యాన్ని గుర్తు చేస్తూ..
Committee Kurrollu Teaser: నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మూవీ కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (జూన్ 14) రిలీజైంది. అందరినీ బాల్యంలోకి తీసుకెళ్తూ ఎంతో హాయిగా సాగిపోయిందీ టీజర్.
Committee Kurrollu Teaser: కమిటీ కుర్రోళ్ళు మూవీ టీజర్ వచ్చేసింది. నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇండస్ట్రీలో యువ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఆమె నిర్మాణ సంస్థ సినిమాలు, వెబ్ సిరీస్ తీస్తోంది. గతంలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రాగా.. ఇప్పుడీ కమిటీ కుర్రోళ్లు మూవీతో ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కమిటీ కుర్రోళ్ళు టీజర్
కమిటీ కుర్రోళ్ళు మూవీ టీజర్ శుక్రవారం (జూన్ 14) రిలీజైంది. ఈ టీజర్ ను ప్రముఖ నటుడు నితిన్ రిలీజ్ చేయడం విశేషం. ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి తీసుకెళ్లి.. ఆ రోజులే బాగుండేవి అనేలా చేస్తోందీ టీజర్. గోదావరి తీరం, పల్లెటూరి వాతావరణంతో మూవీ టీజర్ సరదాగా సాగిపోయింది. పెద్దయ్యాక పడుతున్న కష్టాలను కాసేపు పక్కన పెట్టి ఓ స్నేహితుల బృందం తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకోవడం ఈ టీజర్లో చూడొచ్చు.
తమతోపాటు ప్రేక్షకులను కూడా తమ బాల్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈ సినిమా ద్వారా మేకర్స్ చేయబోతున్నారు. టీజర్ ద్వారానే ఆ ప్రయత్నానికి మంచి పునాది పడింది. గోదారి తీరంలోని ఓ గ్రామం, అందులో చిన్నతనం నుంచీ ప్రాణ స్నేహితులుగా ఉన్న ఓ గ్రూపు చుట్టూ ఈ సినిమా తిరగనుంది. ఈ నోస్టాల్జిక్ జర్నీకి సిద్ధంగా ఉండండి అంటూ టీజర్ ను మేకర్స్ ముగించారు.
టీజర్‌లో ఊర్లో జరిగే గొడవలను కూడా చూడొచ్చు. అసలు సరదాగా ఉండాల్సిన యువత ఊళ్లో గొడవల్లో ఎందుకు తలదూర్చుతారు. ఆ గొడవల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే విషయాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
కమిటీ కుర్రోళ్లు సినిమా ఏంటి?
ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు.
పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం విశేషం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ప్రముఖ హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రితోపాటు ముఖ్య పాత్రల్లో సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ , కిట్టయ్య , రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు నటిస్తున్నారు.