Committee Kurrollu Box Office Collection: నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి దూసుకెళ్లిన నిహారిక మూవీ కమిటీ కుర్రోళ్లు
Committee Kurrollu Box Office Collection: నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి రావడం విశేషం.
Committee Kurrollu Box Office Collection: మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల నిర్మించిన మూవీ కమిటీ కుర్రోళ్లు. గత శుక్రవారం (ఆగస్ట్ 9) రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. అందరూ కొత్త వాళ్లే అయినా ఈ సినిమాకు మహేష్ బాబు, రాజమౌళి, నానిలాంటి వాళ్లు ఇచ్చిన పాజిటివ్ రివ్యూలు బాగానే కలిసి వచ్చినట్లు కలెక్షన్లు చూస్తే తెలుస్తోంది.
కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్
తాజా రిపోర్టుల ప్రకారం కమిటీ కుర్రోళ్లు మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.7.4 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నటించిన సీనియర్ నటుడు సాయి కుమార్ తప్ప మిగతా ఎవరూ ప్రేక్షకులకు తెలియదు. అయినా ఈ చిన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ మూవీని తీయగా.. ఆ ప్రాంతాల నుంచే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.
యధు వంశీ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా.. ఇక నుంచి వచ్చేవన్నీ లాభాలే. బాక్సాఫీస్ సక్సెస్ తో ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. రెండు ఓటీటీలు ఈ సినిమా డిజటల్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదట్లో ఓటీటీ హక్కుల కోసం ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం డిమాండ్ ఏర్పడినట్లు సినిమా నిర్మాత నిహారిక కొణిదెల కూడా ఈ మధ్యే చెప్పింది. ఈ సినిమాను మహేష్ బాబు, రాజమౌళి, నానిలాంటి ప్రముఖులు కూడా ప్రశంసించారు. ఇది కూడా సినిమా బాక్సాఫీస్ సక్సెస్ కు కారణమైందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ వరుస హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వొచ్చు.
కమిటీ కుర్రోళ్లుపై హెచ్‌టీ తెలుగు రివ్యూ ఇదీ
కమిటీ కుర్రాళ్లు అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి కథ. పల్లెటూళ్లలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు... అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదు వంశీ నాచురల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఓ సినిమాలా కాకుండా ఓ పల్లె వాతావరణాన్ని కళ్ల ముందు తీసుకొచ్చి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించాడు.
ఈ రూరల్ కామెడీ డ్రామాలో అంతర్లీనంగా రిజర్వేషన్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాలకు తావులేకుండా టచ్ చేయడం బాగుంది. ప్రతిభ ఉండి చదువుకు కొందరు ఎలా దూరం అవుతున్నారనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మధ్య దూరం పెరగడం అనే అంశాన్ని రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
కమిటీ కుర్రాళ్లుగా మూవీలో 11 మంది హీరోల నటన బాగుంది. ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. అయితే శివగా సందీప్ సరోజ్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ఈశ్వర్‌లకు నటన గుర్తుండిపోతుంది.
పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో సాయికుమార్ తన నటనానుభవంతో అదరగొట్టాడు. గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు దీపక్‌దేవ్ మ్యూజిక్ పెద్ద ప్లస్సయింది. పాటలు, జాతర నేపథ్యంలో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ మారాజు గోదావరి అందాలను చక్కగా చూపించాడు.