Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?-comedy movie sharmajee ki beti trailer released movie to stream in amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Comedy Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Hari Prasad S HT Telugu

Comedy Movie: ఓటీటీలోకి మరో కామెడీ మూవీ నేరుగా వచ్చేస్తోంది. శర్మాజీ కీ బేటీ పేరుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ బుధవారం (జూన్ 19) రిలీజ్ చేశారు. ప్రైమ్ వీడియోలో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Comedy Movie: ఓటీటీల్లోకి ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు నేరుగా వచ్చేస్తున్నాయి. థియేటర్ల జోలికి వెళ్లకుండా చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని ఓటీటీలనే నమ్ముకుంటున్నాయి. అలాంటిదే ఓ కామెడీ మూవీ కూడా ప్రైమ్ వీడియోలోకి నేరుగా రాబోతోంది. శర్మాజీ కీ బేటీ అనే ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం (జూన్ 19) మేకర్స్ రిలీజ్ చేశారు.

శర్మాజీ కీ బేటీ ట్రైలర్

కామెడీతోపాటు మహిళా సాధికారతపై ఓ సందేశాన్ని ఇస్తూ సాగిపోయే మూవీయే శర్మాజీ కీ బేటీ. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్మ అనే ఇంటి పేరు ఉన్న ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ ఖురానా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాక్షి తన్వర్, సయామీ ఖేర్, దివ్యా దత్తాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా సాగిపోయింది. ముందుగా చెప్పినట్లే కామెడీతోపాటు మహిళల సాధికారత గురించి నొక్కి చెప్పే సినిమాగా ఉండనుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. జ్యోతి శర్మ, కిరణ్ శర్మ, తన్వి శర్మ అనే ముగ్గురు మధ్య వయసు మహిళల ఇంట్రడక్షన్ తో ట్రైలర్ మొదలవుతుంది. వీళ్లలో జ్యోతి వర్మ (సాక్షి తన్వర్) ఓ వర్కింగ్ వుమన్. తన మిడిల్ క్లాస్ జీవితాన్ని బిజీ జీవితంతో వెల్లదీయడానికి ప్రయత్నిస్తుంటుంది.

ఇక కిరణ్ శర్మ (దివ్యా దత్తా) ఓ హౌజ్ వైఫ్. భర్త బిజీ. ఒంటరి జీవితంతో విసిగిపోతుంది. కనీసం మాట్లాడటానికి కూడా ఎవరూ లేని పరిస్థితి. అటు తన్వి శర్మ (సయామీ ఖేర్) ఓ పెద్ద క్రికెటర్ కావాలని కలలు కంటూ ఉంటుంది. ఈ ముగ్గురి జీవితాల చుట్టూ తిరుగుతూ ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. బిజీగా ఉండే జ్యోతి శర్మ తన భర్త, కూతురిని కూడా సరిగా పట్టించుకోదు.

ఇక ఖాళీగా ఉన్న కిరణ్ శర్మను తన భర్తతోపాటు ఎవరూ సరిగా వినిపించుకోరు. అటు తన్వి శర్మలోని క్రికెట్ టాలెంట్ ను ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా నమ్మడు. ఇలా ఈ ముగ్గురూ తమ అస్తిత్వం కోసం చేసే పోరాటమే ఈ శర్మాజీ కీ బేటీ మూవీ.

ప్రైమ్ వీడియోలో శర్మాజీ కీ బేటీ

ఈ కామెడీ మూవీ శర్మాజీ కీ బేటీ మూవీ నేరుగా ప్రైమ్ వీడియోలోకి రానుంది. జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది. ఇక ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. "విధి నడిపించే ఐదుగురు బలమైన మహిళల ఐదు అందమైన స్టోరీలు" అని చెప్పింది.

ఓ సినిమా తీయడం తాహిరాకు ఇదే తొలిసారి అయినా.. గతంలో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఆమె సొంతం. నీనా గుప్తా నటించిన పిన్నీ, టోఫీలాంటి షార్ట్ ఫిల్మ్స్ కి ఆమె దర్శకత్వం వహించింది. ఐదేళ్ల కిందట బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఆ మహమ్మారిని జయించింది తాహిరా కశ్యప్.