Cirkus Advance Bookings: రణ్‌వీర్, పూజా హెగ్డేలకు షాక్.. సర్కస్‌కు ఇంత దారుణమైన అడ్వాన్స్ బుకింగ్సా?
Cirkus Advance Bookings: రణ్‌వీర్, పూజా హెగ్డేలకు షాక్ తగిలింది. వీళ్లు నటించిన సర్కస్ మూవీకి దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Cirkus Advance Bookings: బాలీవుడ్‌లో కాస్త పేరున్న నటుడు రణ్‌వీర్ సింగ్. అతని సినిమాలకు మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తారు. కానీ అతని లేటెస్ట్ మూవీ సర్కస్ మాత్రం రణ్‌వీర్‌కు షాకిచ్చింది. ఈ సినిమాకు మరీ దారుణంగా కేవలం రూ.4.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే జరిగాయి. ఈ విషయాన్ని బాక్సాఫీస్ ఇండియా వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
శుక్రవారం (డిసెంబర్ 23) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గత శనివారమే సర్కస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఆరు రోజుల పాటు ఆ సినిమా బుకింగ్స్ ఏమాత్రం పుంజుకోలేదని బాక్సాఫీస్ ఇండియా తెలిపింది. ఈ బుకింగ్స్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ హిందీ వెర్షన్ కంటే చాలా తక్కువ కావడం మరో విశేషం. అవతార్ 2 మూవీకి రూ.8 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
సర్కస్ మూవీకి రివ్యూలు కూడా దారుణంగా ఉన్నాయి. 2022లో పరమ చెత్త మూవీని రణ్‌వీర్, రోహిత్ శెట్టిలు అందించారంటూ ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ రివ్యూ రాసింది. ఈ నెగటివ్ రివ్యూలు సర్కస్ బిజినెస్‌ను మరింత దెబ్బ తీయనున్నాయి. ఈ మూవీలో రణ్‌వీర్ డ్యుయల్ రోల్‌లో నటించాడు. పూజా హెగ్డేతోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ఫిమేల్ లీడ్స్‌గా కనిపించారు.
నిజానికి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలోనే నెటిజన్లు ట్రోల్ చేశారు. అసలు ఈ సినిమాలో ఏముందో అర్థం కాలేదని వాళ్లు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు మూవీ రిలీజైన తర్వాత ఈ నెగటివ్ కామెంట్స్ మరింత పెరిగిపోయాయి. ఓ డబ్బింగ్ సినిమా కంటే దారుణమైన వసూళ్లు రావడం రణ్‌వీర్ సింగ్‌కు మింగుడు పడనిదే.
క్రిస్మస్‌తో రానున్నది లాంగ్ వీకెండ్. అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సర్కస్ యూనిట్‌ను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇప్పుడు వస్తున్న నెగటివ్ రివ్యూలతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం ఖాయంగా కనిపిస్తోంది.