Harish Shankar: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా రివ్యూలపై చాలా చర్చ జరుగుతోంది. రివ్యూలను ఆచితూచి ఇవ్వాలని, సినిమాలను బతికించేలా ఉండాలని కొందరు నటులు, దర్శకులు, నిర్మాతలు.. సినీ జర్నలిస్టులకు సూచిస్తున్నారు. మరోవైపు.. సినిమా బాగుంటే రివ్యూలు కూడా బాగానే ఉంటాయని కొందరు జర్నలిస్టులు వాదిస్తున్నారు. గతంలో కోటబొమ్మాళి పీఎస్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‍లో నిర్మాతలు.. కొందరు సినీ జర్నలిస్టులకు మాటల యుద్ధం లాంటిది జరిగింది. తాజాగా, ఇప్పుడు ఈగల్ సినిమా సక్సెస్ మీట్‍లో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ మరోసారి ఈ రివ్యూల వివాదంపై మాట్లాడారు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 9) థియేటర్లలో రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో రెండు రోజుల్లోనే రూ.20కోట్ల గ్రాస్ దక్కించుకుంది. దీంతో నేడు (ఫిబ్రవరి 11) సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హరీశ్ శంకర్ అతిథిగా హాజరయ్యారు. అయితే, ఈ చిత్రానికి వచ్చిన ఓ నెగెటివ్ రివ్యూపై ప్రముఖ హరీశ్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూవీ జర్నలిస్టులు కూడా సినిమా ఇండస్ట్రీలో భాగమేనని హరీశ్ శంకర్ అన్నారు. విమర్శలు చేసుకుంటూ రాళ్లు వేసుకోవడాలు వద్దని చెప్పారు. “మనందరం మర్చిపోయామా.. మనలో కొందరు మర్చిపోయారా అనేది నాకు తెలియదు. గుర్తు లేని వాళ్లకు గుర్తు చేస్తున్నా. సినిమా ఇండస్ట్రీ అంటే.. సినీ నిర్మాతలు, సినీ దర్శకుడు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా. మనమందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్లు.. మేము మీద రాళ్లు వేసుకోవడానికి.. మీరు ఆ గట్టున.. మేం ఈ గట్టున లేం. సినీ జర్నలిస్టులంటే ఇండస్ట్రీలో భాగమే. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు” అని హరీశ్ శంకర్ చెప్పారు.
నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టులు కూడా ఇండస్ట్రీలో భాగమేనని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని హరీశ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
స్టార్ సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతున్న కార్తీక్ ఘట్టమనేని.. ఈగల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా, ఈ ఈవెంట్‍లో కార్తీక్‍పై రవితేజ ప్రశంసల వర్షం కురిపించారు. కార్తీక్ టాప్ డైరెక్టర్లలో ఒకడు అవుతాడని చెప్పారు.
“నా మాటలను రాసిపెట్టుకోండి. టాప్ డైరెక్టర్లలో ఒకడు (కార్తీక్) అవుతాడు. ఇతడికి ఉన్న విజన్ టాప్‍లో ఉంది. నాకు చెప్పిన దాని కంటే ఎక్కడికో తీసుకెళ్లాడు. ఇలాంటి క్యారెక్టర్ రాసి.. నాకు చెప్పడం.. నాకు నచ్చడం.. అది జరగడం.. అందరూ ఆ క్యారెక్టర్ గురించి మెచ్చుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది” అని రవితేజ అన్నారు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత దర్శకుడిగా కార్తీక్‍కు ఈగల్ రెండో మూవీగా ఉంది.
ఈగల్ చిత్రంలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవ్‍దీప్ కీలకపాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డేవ్ జంద్ సంగీతం అందించారు. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాపిక్