CID actor passed away: విషాదం.. సీఐడీ సీరియల్ నటుడు మృతి
CID actor passed away: ప్రముఖ డిటెక్టివ్ షో సీఐడీలో ఏళ్ల పాటు నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కన్ను మూశాడు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అతడు తుది శ్వాస విడిచాడు.
CID actor passed away: సీఐడీ సీరియల్ తెలుసు కదా. 20 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది ఈ డిటెక్టివ్ షో. ఇందులో ఫ్రెడ్రిక్స్ అనే పాత్ర పోషించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూశాడు. సోమవారం (డిసెంబర్ 4) అర్ధరాత్రి అతడు తుది శ్వాస విడిచాడు. మంగళవారం అతని అంత్యక్రియలు చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
దినేష్ ఫడ్నిస్ శనివారం (డిసెంబర్ 2) నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నాడు. మొదట్లో అతనికి హార్ట్ ఎటాక్ రావడం వల్ల హాస్పిటల్లో చేరాడని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అది నిజం కాదని దినేష్ సహ నటుడు దయానంద్ శెట్టి చెప్పాడు. "దినేష్ ఫడ్నిస్ హాస్పిటల్లో చేరాడు, వెంటిలేటర్ పై ఉన్నాడు. డాక్టర్ల పరిశీలనలో ఉన్నాడు. అతనికి హార్ట్ ఎటాక్ రాలేదు. వేరే చికిత్స నడుస్తోంది. దానిపై మాట్లాడను" అని శనివారం దయానంద్ చెప్పాడు.
సీఐడీలో సీనియర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో దయానంద్ నటించాడు. 1998 నుంచి 2018 వరకూ 20 ఏళ్ల పాటు టీవీ ప్రేక్షకులను ఈ సీఐడీ అలరించగా.. అందులో ఫ్రెడ్రిక్స్ పాత్రలో దినేష్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం సాగిన షోలలో ఇదీ ఒకటి. ఇందులో దినేష్ పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది.
ఈ సీఐడీ షోలో నటించడంతోపాటు ఇందులో కొన్ని ఎపిసోడ్లకు దినేష్ రచయితగానూ వ్యవహరించడం విశేషం. ఇక మరో టీవీ షో తారక్ మెహతా కా ఉల్టా చెష్మాలోనూ దినేష్ అతిథిపాత్రలో కనిపించాడు. సర్ఫరోష్, సూపర్ 30లాంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాకు రచయితగా పని చేశాడు.
అతని మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ దినేష్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సీఐడీ షో ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో దినేష్ టచ్ లో ఉన్నాడు. చాలా రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న దినేష్ మరణం అభిమానులను కలచివేస్తోంది.