Telugu News  /  Entertainment  /  Chup Revenge Of The Artist Movie Review In Telugu
చుప్ మూవీ రివ్యూ
చుప్ మూవీ రివ్యూ

CHUP Movie Review : సినిమాను ప్రేమించేవాళ్లు.. వాటికి రేటింగ్ ఇచ్చేవాళ్లు కచ్చితంగా చూడాల్సిన మూవీ..

29 November 2022, 13:43 ISTGeddam Vijaya Madhuri
29 November 2022, 13:43 IST

CHUP Movie Review : డైరెక్టర్ R.Balki గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో పలు హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ తాజాగా.. దుల్కర్ సల్మాన్​తో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కించాడు. ధియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా ఓటీటీలో విడుదలై.. సంచలనం సృష్టిస్తోంది.

Chup : Revenge of the Artist Review : తెలుగులో సీతారామం సినిమాతో భారీ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్.. తాజాగా చుప్ అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ స్టోరీలు సెలక్ట్ చేసుకోవడంలో దుల్కర్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అదే అతనిని ప్రేక్షకులకు దగ్గర చేసింది. దానికి నిదర్శనమే చుప్.

ట్రెండింగ్ వార్తలు

డైరెక్టర్ ఆర్. బాల్కి తెరకెక్కించిన చిత్రం చుప్. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సన్నీడియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి, పూజ భట్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. నవంబర్ 25వ తేదీనుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూసిన ప్రతి సినిమా ప్రేమికుడు థియేటర్​లో ఎలా మిస్​ అయ్యాను అని కచ్చితంగా బాధపడతాడు. ఇంతకీ ఈ సినిమా కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చుప్ కథ ఏమిటంటే..

ఒకప్పుడు నేనింతే సినిమాతో.. ఒక మూవీ తీయడం ఎంత కష్టమో పూరీ మనకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతా కష్టపడి ఒక మూవీ తీసిన తర్వాత.. ఒక ఫేక్ రివ్యూ ఇస్తే.. ఆ సినిమా పరిస్థితి ఏమవుతుంది అనేదే ఈ చుప్ కథ. ఓపెన్ చేస్తే.. ముంబైలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మూవీ క్రిటిక్స్​ని టార్గెట్​ చేసి.. వాళ్లు ఇచ్చిన ఫేక్ రివ్యూలకు అనుగుణంగా హత్యలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్​కి.. ఈ మూవీ క్రిటిక్స్​కి సంబంధం ఏమిటి? పోలీసులు హంతకుడిని పట్టుకోవడానికి ఏమి ప్లాన్ చేశారు? ఇంతకీ హంతకుడు దొరికాడా లేదా? హంతకుడు మూవీ క్రిటిక్స్​నే ఎందుకు చంపుతున్నాడనేది మీరు చూడాల్సిందే.

ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో కూడా దర్శకుడు ఓ అందమైన ప్రేమ కథను చూపించాడు. దుల్కర్, శ్రేయా మధ్య జరిగే ప్రేమాయణం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూవీ క్రిటిక్స్​ వరుస హత్యలకు.. హీరోకి సంబంధం ఉందా? అని హీరోయిన్ ఆలోచించే తీరు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పోలీస్​ ఆఫీసర్​ (IG)గా సన్నీడియోల్ తన నటనతో అదరగొట్టాడు. అరవింద్ మాథూర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హంతకుడిని పట్టుకోవడం కోసం తను చేసే ప్లాన్స్ ప్రేక్షకుడిని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. తన ప్లాన్​లో భాగంగా హీరోయిన్ ప్రాణాలనే పణంగా పెట్టి.. అరవింద్ హంతకుడిని పట్టుకుంటాడా? లేదా హీరోయిన్ ప్రాణాలే పోతాయా? తక్కువ స్టార్స్​ ఇచ్చిన క్రిటిక్స్​నే హంతకుడు హత్య చేస్తాడా? లేదా ఎక్కువ రేటింగ్ ఇచ్చిన వారిని హత్య చేయడా? నర్సరీని నడిపే దుల్కర్​కి.. ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలు ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి.

సందేశం..

చాలామంది ఆడియన్స్ సినిమాను చూసి థియేటర్​కు నేరుగా వెళ్లరు. రివ్యూలను చూసి.. ఓ అంచనాకు వచ్చి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు సినిమా క్రిటిక్స్ సినిమా రివ్యూ ఇవ్వడంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఫేక్స్ రివ్యూలు ఇస్తూ సినిమాను ప్రేక్షకుడికి దూరం చేస్తారు. ప్రతి శుక్రవారం ఏదొక దర్శకుడు.. తన సత్తా చూపించుకునేందుకు థియేటర్​కు వస్తే.. బాగున్న సినిమాను ఏ మాత్రం బాలేదంటూ.. బాలేని సినిమాకు బాగుందంటూ రివ్యూ ఇచ్చేవారు లేకపోలేరు.

అలాంటి సినిమాల విషయానికి వస్తే.. ఖలేజా, ఆరెంజ్, అతడు వంటి సినిమాలు.. థియేటర్లలో లాభాలను తీసుకురాలేదు. కానీ అవి టీవీలో స్ట్రీమ్​ అయినప్పుడు టీఆర్​పీ రేటింగ్​లు అంచనాలను మించిపోయాయి. కానీ ఇవి థియేటర్లలో ఎందుకు ఆడలేదు అంటే.. ఎవరి దగ్గర సరైన సమాధానం ఉండదు. ఓ సినిమాను తీయడానికి ఎందరో కష్టపడతారు. కానీ దాని రివ్యూ ఇచ్చే వ్యక్తి ఇంట్లో ల్యాప్​టాప్​ ముందు ఓ గంట కూర్చుంటే చాలు. తెరమీద కనిపించే సినిమాకు.. తెరవెనుకు రాసే రివ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి రివ్యూలు చదవకుండా సినిమాకు వెళ్తేనే మంచిది. సినిమా చూసిన వాళ్లు కరెక్ట్ రివ్యూ ఇస్తేనే సినిమా బతుకుతుంది. ఈ సున్నితమైన అంశాన్ని డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించాడు.

పాత్రల్లో జీవించారు..

దర్శకుడిగా కథను చాలా సమర్థవంతంగా నడిపించాడు ఆర్. బాల్కి. సన్నీడియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి.. వారి వారి పాత్రల్లో జీవించారు. అమితాబ్​ బచ్చన్ ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేసినా.. పాత్ర మేరకు చక్కగా నటించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

CHUP Movie Review..

ఈ సినిమా ప్రతి సినిమా ప్రేమికుడిని ఆకట్టుకుంటుంది. ప్రతి సినిమా క్రిటిక్​ని అలెర్ట్ చేస్తుంది. Worth to Watch.

రేటింగ్ : 3.5/5