క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) దర్శకత్వంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ఓపెన్‌హైమర్(Oppenheimer). ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాలో హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓపెన్‌హైమర్ పై చర్చ నడుస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, జపాన్‌లోని రెండు నగరాలపై అణు బాంబులు వేశారు. ఈ అణు బాంబును J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ కనుగొన్నారు. ఆయన జీవితాధారంగా తెరకెక్కించిన సినిమానే ఓపెన్‌హైమర్. అయితే తాజాగా ఈ చిత్రంపై వివాదం ఎక్కువైంది.
ఈ సినిమాలో ఫ్లోరెన్స్ పగ్ పాత్రధారి జీన్ టాట్ లాక్, ఓపెన్‌హైమర్ మధ్య ఓ శృంగార సన్నివేశం వస్తుంది. ఇందులో భగవద్గీత చదువుతూ ఆ సన్నివేశాలు ఉంటాయి. దీంతో హిందూవులకు పవిత్రమైన గ్రంథాన్ని ఇలాంటి సీన్లలో ఎలా ఉపయోగించారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఒక్క సీన్ లోనే కాదు.. సినిమాలో భగవద్గీత(Bhagavad Gita) ప్రభావం చాలానే ఉంటుంది. సోషల్ మీడియా(Social Media)లో ఈ చిత్రంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో భగవద్గీతను ప్రస్తావించడం ఓకే.. కానీ.. అలాంటి సీన్లలో ఎలా ఉపయోగిస్తారని చాలా మంది మండిపడుతున్నారు.
సెక్స్ సన్నివేశాలలో భగవద్గీతను చిత్రీకరించడం పట్ల ప్రేక్షకులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ట్విట్టర్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హిందూవూల మనోభావాలను దెబ్బ తీశారని విమర్శలు చేస్తున్నారు. భగవద్గీత తమకు ఎంతో పవిత్రమైనదని, అలాంటి గ్రంథాన్ని ఇలాంటి సీన్లలో ఎలా ఉపయోగిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డ్.. ఇలాంటి సన్నివేశాలను ఎలా అనుమతించిందని కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలా చేస్తే.. ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అని.. ఇలాంటివి చేయడం పద్ధతేనా అని అడుగుతున్నారు.
'ఓపెన్‌హైమర్ సినిమాలో భగవద్గీత ప్రస్తావన రావడం మంచి విషయమే.. కానీ హిందూవులు మనోభావాలు దెబ్బతీసేలా.. హాలీవుడ్(Hollywood)లో గీతను అగౌరవపరిచారు. సెక్స్ సీన్ల సమయంలో పవిత్ర శ్లోకాలను ప్రస్తావించడం ఏంటి?' అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నస్తున్నారు.
ఈ చిత్రంలో చాలా సన్నివేశాల్లో భగవద్గీత ప్రభావం ఉంటుంది. నిజ జీవితంలోనూ ఓపెన్‌హైమర్ భగవద్గీతోపాటుగా పలు హిందూ పురాణ గ్రంథాలను చదివాడని చెబుతారు. ఆయనకు సంస్కృత భాష అంటే ఇష్టమట. భగవద్గీతలోని ఓ శ్లోకం ఓపెన్ హైమర్ ను బాగా ప్రభావితం చేసిందట.