Vikram on SSMB 29: మహేశ్ - రాజమౌళి సినిమాలో నటించనున్నారా? ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పిన విక్రమ్
Chiyaan Vikram on SSMB 29: తంగలాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో చియాన్ విక్రమ్.. హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడారు. దర్శక ధీరుడు రాజమౌళి తదుపరి మూవీ కోసం చర్చలు జరిగాయా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి విక్రమ్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన తంగలాన్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. విక్రమ్‍కు క్రేజ్ ఉండటంతో తెలుగులోనూ మంచి కలెక్షన్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. తంగలాన్ తెలుగు వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా నేడు (ఆగస్టు 5) హైదరాబాద్‍లో మీడియాతో విక్రమ్ మాట్లాడారు.
మాట్లాడుతున్నాం.. కానీ..
మహేశ్ బాబుతో చేసే సినిమా కోసం డైరెక్టర్ రాజమౌళి తమను సంప్రదించారనే వార్తలు వచ్చాయని, దీనిపై స్పందించాలని చియాన్ విక్రమ్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఆన్సర్ ఇచ్చారు. రాజమౌళి, తాను మాట్లాడుతున్నామని, ఏదో ఒక సమయంలో మూవీ చేస్తామని అన్నారు. కానీ ఇదే సినిమా అని ఏమీ అనుకోలేదని విక్రమ్ చెప్పారు.
కాదనకుండా ఇంట్రెస్టింగ్ ఆన్సర్
ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో నటించనున్నారా.. లేదా అనేది విక్రమ్ స్పష్టంగా చెప్పలేదు. రాజమౌళి, తాను మాట్లాడుతున్నానంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. ఏదో మూవీ చేస్తామన్నారు. దీంతో మహేశ్‍తో మూవీ కోసం సంప్రదింపులు విక్రమ్‍తో సంప్రదింపులు జరిగాయనే రూమర్లకు బలం చేకూరింది. మరి, ఆ చిత్రంలో విక్రమ్ ఉంటారా లేదా అనేది చూడాలి.
ఏదీ ముఖ్యం కాదు
ఐ మూవీలా తంగలాన్ కోసం కూడా హెల్త్ రిస్క్ ఏమైనా చేశారా అనే ప్రశ్నకు విక్రమ్ బదులిచ్చారు. సినిమానే ముఖ్యమని అనుకున్నప్పుడు.. ఆరోగ్యంతో పాటు ఏదీ ఇంపార్టెంట్ కాదని అనిపిస్తుందని విక్రమ్ చెప్పారు. భోజనం, డబ్బు ఏదీ ముఖ్యం కాదని అనుకుంటానని చెప్పారు. నటుడిగా ఓ పాత్రను ఎంజాయ్ చేస్తున్నప్పుడు అదే ముఖ్యమని భావిస్తానని అన్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి పాపులర్ అయ్యారు. మహేశ్ బాబుతో తదుపరి యాక్షన్ అడ్వెంచర్ మూవీ కూడా గ్లోబల్ రేంజ్‍లోనే రూపొందించాలనే రాజమౌళి డిసైడ్ అయ్యారు. భారీ స్థాయిలో సుమారు రూ.1,000కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ ఉంటుందనే రూమర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం కోసం కొత్త లుక్‍తో సిద్ధమవుతున్నారు మహేశ్. షూటింగ్‍కు అంతా రెడీ చేసే పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది.
తంగలాన్ గురించి..
తంగలాన్ చిత్రంలో ఓ తెగకు నాయకుడిగా విక్రమ్ నటించారు. బ్రిటీష్ పాలన కాలంలో కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో బంగారం కోసం జరిగిన తవ్వకాలు, ఎదురైన సవాళ్ల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్స్, యాక్షన్, విక్రమ్, మాళవిక మోహనన్ యాక్టింగ్ అదిరిపోయాయి. దీంతో పా రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి, డానియెల్ కాల్టగిరోన్, హరికృష్ణన్ అన్బుదురై కీరోల్స్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఆగస్టు 15న తంగలాన్ రిలీజ్ కానుంది. గ్రీన్ స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.