టైటిల్: చిట్టి పొట్టి
నటీనటులు: రామ్ మిట్టకంటి, పవిత్ర, కష్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: భాస్కర్ యాదవ్ దాసరి
సంగీతం: శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోషి
ఎడిటింగ్: బాలకృష్ణ బోయ
నిర్మాణ సంస్థ: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
Chitti Potti Review Telugu: ఫ్యామిలీ డ్రామా అండ్ ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కిన తెలుగు మూవీ చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కష్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాతగా అన్ని తానై వ్యవహరించారు భాస్కర్ యాదవ్ దాసరి. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చిట్టి పొట్టి రివ్యూలో తెలుసుకుందాం.
రామ్‌కు చెల్లెలు పవిత్ర అంటే ఎంతో ఇష్టం. తన పెళ్లి కోసం ఊరిలో ఉన్న, దూరంగా ఉన్న బంధువులందరిని లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఒక్కటి చేస్తాడు రామ్. పంతాలు, పట్టింపులు వదిలి బంధాలు, అనుబంధాలు తెలిసేలా చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు రామ్. దానికి బంధువులంతా సహకరిస్తారు.
ఈ క్రమంలోనే రామ్‌ను అమెరికాలో ఉన్న కష్వి అక్కడికి వచ్చేయమని పోరు పెడుతుంది. కానీ, ఫ్యామిలీ దూరంగా ఉండటం ఇష్టం లేక రామ్ వెళ్లడు. ఓ సందర్భంలో కష్వినే ఇండియాకు వస్తుంది. రామ్‌ను కలిసిన కష్వి ఏం చేసింది? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటీ? రామ్ చెల్లెలు పవిత్ర వివాహం ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే? చిట్టి పొట్టి సినిమా చూడాల్సిందే.
ఈ మధ్య కాలంలో సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాలు చాలా తగ్గిపోయాయి. సిస్టర్ సెంటిమెంట్ చిత్రాలంటే గోరింటాకు, అన్నవరం సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. చాలా కాలం తర్వాత సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన తెలుగు చిత్రమే చిట్టి పొట్టి. ఇందులో నటించిన మెయిన్ యాక్టర్స్ తమ ఒరిజినల్ పేర్లతో పాత్రలు పోషించడం విశేషం.
చిట్టి పొట్టి సినిమాను ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు డైరెక్టర్. కుటుంబాలు, బంధువుల మధ్య గొడవలు, ఆప్యాయతలు, పట్టింపులు, అనుబంధాలు ప్రతిబింబించే సీన్లతో సినిమాను మలిచారు. అక్కడక్కడ కామెడీ ట్రాక్‌తో పర్వాలేదనిపించారు. ఇక బాధ్యతగల అన్నగా రామ్ మిట్టకంటి అద్భుతంగా నటించాడు.
చెల్లెలి పాత్రలో పవిత్ర ఒదిగిపోయింది. వీరిద్దరు అన్నా.. చెల్లెలుగా అలరించారు. అమెరికాలో అమ్మాయిగా కష్వీ మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించి మెప్పించారు. బోరింగ్ సన్నివేశాలు లేకుండా బాలకృష్ణ బోయ ఎడిటింగ్ పర్ఫెక్ట్గా ఉంది.
ఇక శ్రీ వెంకట్ నేపథ్య సంగీతం సన్నివేశానికి తగిన మూడ్ తీసుకొచ్చేలా బాగుంది. పాటలు పర్వాలేదు. ఎమోషన్ సన్నివేశాల్లో ఆర్ఆర్ బాగా వర్కౌట్ అయింది. మల్హర్ భట్ జోషి కెమెరా వర్క్ బాగుంది.
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం వహించిన భాస్కర్ యాదవ్ దాసరి చాలా మంచి కథతో ఎమోషన్ కథనంతో చిట్టి పొట్టి సినిమాను తెరకెక్కించారని చెప్పొచ్చు.
అన్నా చెల్లెలి మధ్య ఉండే బాండింగ్‌ను బాగా చూపించారు. ఫ్యామిలీ అందరూ కలిసుంటే ఎంత బాగుంటుంది అనే కోణంలో కుటుంబ విలువలు చక్కగా చూపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే కుటుంబంతో కలిసి టైమ్ పాస్‌కు ఓసారి చూడాల్సిన సినిమా చిట్టి పొట్టి.