Balakrishna vs Chiranjeevi: బాలయ్య-చిరంజీవి నిజమైన సంక్రాంతి హీరో ఎవరు? 11 సార్లు బరిలో దిగితే పందెం గెలిచింది ఎవరు?-chiranjeevi vs balakrishna which hero got more successes in sankranti season ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Chiranjeevi Vs Balakrishna Which Hero Got More Successes In Sankranti Season

Balakrishna vs Chiranjeevi: బాలయ్య-చిరంజీవి నిజమైన సంక్రాంతి హీరో ఎవరు? 11 సార్లు బరిలో దిగితే పందెం గెలిచింది ఎవరు?

Maragani Govardhan HT Telugu
Jan 13, 2023 12:13 PM IST

Balakrishna vs Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరూ ఈ సారి సంక్రాంతికి తమ సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ 11 సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడగా.. ఎవరు ఎక్కువ విజయాలను అందుకున్నారో ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి బరిలో గెలిచిన పుంజు ఏది?
సంక్రాంతి బరిలో గెలిచిన పుంజు ఏది?

Balkrishna vs Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు నాట వీరిద్దరి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి సినిమాలకున్న పోటీ మరే హీరోకు ఉండదనేదని వాస్తవం. అభిమానుల విషయంలో ఇద్దరిలో ఎవ్వరినీ తక్కువ చేయడానికి లేదు. వీరి సినిమా ఒక సీజన్‌లో విడుదలవుతుందంటే.. ఫ్యాన్స్ హడావిడి అంతా ఇంతా ఉండదు. అందులోనూ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. అయితే పండగ సీజన్‌లో వీరిద్దరు బాక్సాఫీస్ బరిలో 11 సార్లు తలపడ్డారు. 1985 నుంచి ఇప్పటి వరకు బరిలో పోటీ పడిన వీరు మరోసారి పందెలోకి దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఈ సంక్రాంతి సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ ఎవరికి కలిసొచ్చింది? ఎవరికి ఎక్కువ విజయాలు దక్కాయో ఇప్పుడు చూద్దాం.

చట్టంతో పోరాటం- ఆత్మబలం..

చిరంజీవి-బాలకృష్ణ తొలిసారిగా సంక్రాంతి బరిలో 1985లో పోటీ పడ్డారు. చట్టంతో పోరాటం సినిమాతో మెగాస్టార్, ఆత్మబలం చిత్రంతో బాలయ్య పండగ సీజన్‌లో తలపడ్డారు. కే బాపయ్య చట్టంతో పోరాటం సినిమాకు దర్శకత్వం వహించగా.. తాతినేని ప్రసాద్ ఆత్మబలం సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందు ఓ మాదిరిగా అలరించాయి.

దొంగమొగుడు-భార్గవరాముడు..

అనంతరం రెండేళ్ల విరామం తర్వాతర 1987లో చిరంజీవి దొంగమొగుడు సినిమాతో సంక్రాంతికి సందడి చేశారు. ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరోపక్క బాలకృష్ణ భార్గవరాముడు చిత్రంతో జనవరి 14న సందడి చేశారు. ఈ చిత్రానికి కూడా కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మంచిదొంగ-ఇన్‌స్పెక్టర్ ప్రతాప్..

అనంతరం తదుపరి సంవత్సరమే 1988లో చిరంజీవి మంచి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేశారు. జనవరి 14న ఇది విడుదలైంది. ఈ సినిమాకు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మరోపక్క ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో బాలయ్య సందడి చేశారు. ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి కూడా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు-భలేదొంగ..

ఆ తర్వాత వీరిద్దరూ 1989లో మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంతో మెగాస్టార్ సందడి చేయగా.. భలేదొంగ చిత్రంతో బాలయ్య వచ్చారు. జనవరి 14న అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. అంతకంటే ముందు జనవరి 10న భలేదొంగ విడుదల ఓ మాదిరి హిట్‌ను సాధించింది. ఈ రెండు చిత్రాలకు కూడా కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం.

హిట్లర్-పెద్దన్నయ్య..

ఈ సారి ఫ్యామిలీ సెంటిమెంటును నమ్ముకుని ఈ అగ్రహీరోల సంక్రాంతి బరిలో నిలిచారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత సంక్రాంతి సీజన్‌లో తలపడ్డారు. 1997 జనవరి 4న హిట్లర్ చిత్రంతో చిరంజీవి సందడి చేశారు. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ దర్శకత్వం వహించారు. మరోపక్క బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. హిట్లర్‌లో ఐదుగురు సిస్టర్స్ సెంటిమెంటు ఉండగా.. పెద్దన్నయ్య చిత్రం ముగ్గురు సోదరుల మధ్య అనుబంధాన్ని చూపించారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.

సమరసింహారెడ్డి-స్నేహంకోసం..

అనంతరం రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య-చిరంజీవి పండగ సీజన్‌లో పోటీ పడ్డారు. చిరంజీవి జనవరి 1న కేఎస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహంకోసం సినిమాతో సందడి చేయగా.. బాలకృష్ణ బీ గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా జనవరి 13న విడుదలైంది. అయితే ఈ రెండింట్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్టవగా.. స్నేహంకోసం చిత్రం మాత్రం యావరేజ్‌గా నిలిచింది. అయితే ఇందులో చిరంజీవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరోపక్క సమరసింహారెడ్డి చిత్రం ఫ్యాక్షన్ సినిమాలకు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

అన్నయ్య-వంశోద్ధారకుడు..

1997లో దర్శకుల కాంబినేషన్ మరోసారి 2000లోనూ రిపటైంది. హిట్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ముత్యాల సుబ్బయ్య అన్నయ్య చిత్రంతో మరోసారి మెగాస్టార్‌ను సంక్రాంతి బరిలో నిలిపారు. ఈ సినిమా జనవరి 7న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరోపక్క బాలకృష్ణకు పెద్దన్నయ్య లాంటి సక్సెస్ ఇచ్చిన శరత్.. వంశోద్ధారకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 14న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మృగరాజు-నరసింహానాయుడు..

అనంతరం ఏడాది తర్వాత మెగాస్టార్-బాలయ్య మరోసారి సంక్రాంతి సీజన్‌లో పోటీ పడ్డారు. 2001 జనవరి 11న చిరంజీవి మృగరాజు సినిమాతో సందడి చేశారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క అదే రోజున బాలకృష్ణ బీ గోపాల్ దర్శకత్వంలో నరసింహానాయుడుతో సందడి చేశారు. సమరసింహారెడ్డి కాంబో రిపీట్ కావడంతో ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

అంజి-లక్ష్మీనరసింహా..

మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు చిరు-బాలయ్య. 2004లో అంజి సినిమాతో మెగాస్టార్ సందడి చేయగా.. లక్ష్మీనరసింహ చిత్రంతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంజి సినిమాకు కోడీ రామకృష్ణ దర్శకత్వం వహిస్తే.. లక్ష్మీనరసింహా చిత్రానికి జయంత్ సీ పరాంజీ తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల్లో లక్ష్మీ నరసింహా అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగా.. అంజి సినిమా ఫ్లాప్‌గా నిలిచింది.

ఖైదీ నెంబర్ 150- గౌతమిపుత్ర శాతకర్ణి..

13 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరి కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఇది చిరంజీవి నటించిన 150వ చిత్రం కాగా.. బాలకృష్ణకు వందో సినిమా. వీవీ వినయాక్ ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని తెరకెక్కించారు. మరోపక్క క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైంది. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఖైదీ నెంబర్ 150 కమర్షియల్‌గా సక్సెస్ సాధిస్తే.. గౌతమిపుత్ర శాతకర్ణ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

వీరసింహారెడ్డి-వాల్తేరు వీరయ్య..

ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి బాలయ్య-చిరంజీవి సంక్రాంతి సీజన్‌లో పోటీ పడుతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డితో బాలయ్య సందడి చేస్తుండగా.. బాబీ దర్శకత్వంలోని వాల్తేరు వీరయ్య చిత్రంతో మెగాస్టార్ వస్తున్నారు. ఈ రెండు చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మించడం గమనార్హం.

ఈ అగ్రహీరోలు ఇద్దరూ ఇప్పటి వరకు 11 సార్లు తలపడగా.. చాలా సార్లు ఇద్దరి చిత్రాలు సక్సెస్ అందుకున్నాయి. కొన్నిసార్లు మాత్రం ఒకరు ముందంజ వేశారు. మరి సంక్రాంతి సీజన్‌కు ఎక్కువ సార్లు ఎవరు హిట్లు అందుకున్నారో ఇప్పటికే మీకర్థమై ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం