Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. భోళా మేనియా అంటూ అదిరిపోయేలా..
Bhola Shankar First Song launched: మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళా శంకర్ నుంచి మొదటి పాట విడుదలైంది. భోళా మేనియా అంటూ వచ్చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈపాటను లాంచ్ చేశారు.
Bhola Shankar First Song launched: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మాస్ పండుగ వచ్చేసింది. చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్' సినిమా నుంచి మొదటి పాట విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ నేటి (జూన్ 4) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ అయింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ఈ పాటను లాంచ్ చేశారు. భోళా మేనియా అంటూ కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న చిత్రయూనిట్ ఎట్టకేలకు ఈ మాస్ బీట్ పాటను విడుదల చేసింది. భోళా శంకర్ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‍గా ఉన్న ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
"అదిరే స్టైలయ్యా, పగిలే స్వాగయ్యా, యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా" అంటూ మొదలయ్యే ఈ పాట అదిరిపోయేలా ఉంది. మెగాస్టార్ అభిమానులను అలరించేలా మాస్ బీట్‍తో మహతీ స్వరసాగర్ ఈ భోళా మేనియా పాటకు ట్యూన్స్ ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఆగస్టు 11వ తేదీన భోళా శంకర్ సినిమా విడుదల కానుంది.
భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్ తమన్నా నటిస్తోంది. చిరు సోదరి పాత్రను ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ పోషిస్తోంది. మురళీ శర్మ, సుశాంత్, వెన్నెల కిశోర్, రశ్మీ గౌతమ్ సహా మరికొందరు ఈ మూవీలో నటిస్తున్నారు.
కేఎస్ రామారావు, రామ్‍బ్రహ్మం సుంకర.. భోళా శంకర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై ఈ మూవీ వస్తోంది. దర్శకత్వంతో పాటు స్క్రీన్‍ప్లే బాధ్యతలు కూడా మెహర్ రమేశ్ నిర్వర్తిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటర్‌గా ఉన్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ కొట్టారు. ముఖ్యంగా మాస్ పాత్రలో చిరు నటన అభిమానులను మరోసారి విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ కూడా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ కావటంతో భోళా శంకర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందులోనూ మెహర్ రమేశ్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండడంతో ఆసక్తి పెరిగింది. ఆగస్టు 11వ తేదీన భోళా శంకర్ సినిమాను ప్రేక్షకుల మందుకు తీసుకొస్తామని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.